Damadora Rajanarsimha | కోహీర్, జూన్ 15 : కోహీర్ మండలంలోని పీచెర్యాగడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు హామీనిచ్చారు. ఏప్రిల్ 19వ తేదీన స్థానిక పాఠశాల ఆవరణలో చేపట్టిన సమావేశంలో ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం ప్రారంభానికి విచ్చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఈ మేరకు వారు వినతి పత్రం అందజేశారు.
తమ పాఠశాల భవనానికి పెయింటింగ్ చేయించాలని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. భవనానికి ప్రహరీ లేక పశువులు, కీటకాలు పాఠశాల ఆవరణలో సంచరిస్తున్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తమ ఇబ్బందులను తీర్చాలని వేడుకున్నారు. పాఠశాల హెచ్ఎం సురేశ్, విద్యార్థులు కలిసి సమర్పించిన వినతిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు.
పెయింటింగ్ ఖర్చు, ప్రహరీ నిర్మాణం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామన్నారు. విద్యార్థులు కోరిన పనులకు నిధులు కూడా పెద్దగా అవసరం లేదు. కానీ మంత్రి హామీనిచ్చి రెండు నెలలు కావస్తుండటం, పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైనా హామీ అమలు కాలేకపోవడంతో సమస్యల పరిష్కారానికి వారు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు.
దాతల సహాయంతో పెయింటింగ్..
పీచెర్యాగడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు తనవంతుగా రూ.60వేలను పేయింటింగ్ కోసం విరాళమిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేశ్, ఉపాధ్యాయ బృందం కలిసి మరో రూ.40వేలను పోగు చేశారు. మొత్తానికి లక్ష రూపాయల ఖర్చుతో పాఠశాల భవనానికి పేయింటింగ్ పూర్తి చేయించారు.
పాఠశాలను అందంగా తయారు చేయించారు. విద్యార్థుల అవసరార్ధం కవేలి సెయింట్ గోబెన్ పరిశ్రమ ఆధ్వర్యంలో మరుగుదొడ్లను నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. కానీ తాము మంత్రి దామోదర్‌కు విన్నవించిన ప్రహరీ నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు అయినా చేయిస్తారో లేదోనని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. తాము అందించిన వినతిని మరోసారి పరిశీలించాలని వారు వేడుకున్నారు. పేయింటింగ్ వేయించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం