RFCL | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 15 : రామగుండం ఎరువుల కర్మాగారం లో శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో జరిగిన ప్రమాదం లో అస్వస్థతకు గురైన మెకానిక్ విభాగం లో పనిచేస్తున్న ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ కి చెందిన ఎండీ.అఫ్జల్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అయితే ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి బీ షిఫ్ట్ లో అఫ్జల్ తో పాటు సునీల్, వంశీ, శ్రావణ్, శివ కంప్రెసర్ విభాగం లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కంప్రెసర్ కు ఇన్సూలేషన్ బిగుస్తున్న క్రమంలో కంప్రెసర్ వేడికి కంప్రెసర్ పై పడిన ఆయిల్ మంటలు అంటుకున్నాయి.
దీనికి తోడు అమ్మోనియా సైతం స్వల్పంగా లీకేజైంది. వెంటనే స్పందించి తాను కంప్రెసర్ హౌస్ కు మంటలు అంటుకోకుండా ఆపగలిగాడు. అయితే వేడి మంటలు, అమ్మోనియా లీకేజీ తో తాను అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. దీంతో తనను ఆర్ఎఫ్సీఎల్ అధికారులు ఆసుపత్రిలో చేర్పించినట్టు ఆయన తెలిపారు. 40 రోజుల షట్ డౌన్ అనంతరం యూనిట్ లైట్ అప్ సమయం లో ఈ సంఘటన జరిగిందని భాదితుడు తెలిపాడు. ,తాను అప్రమత్తం గా లేకపోతే భారీ నష్టం వాటిల్లేదని వాపోయాడు. కాగా ప్రైవేట్ ఆసుపత్రి లో కోలుకుంటున్న అఫ్జల్ ను ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు. ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ అఫ్జల్ ను కలిసి వివరాలు సేకరించారు.
అందని వేతనాలు..?
కాగా మెకానికల్ విభాగం లో పనిచేస్తున్న 120 మంది కాంట్రాక్టు కార్మికులకు 45 రోజులు గడుస్తున్నా వేతనాలు అందలేదని తెలిసింది. దీనికి తోడు మెకానికల్ విభాగం లో కాంట్రాక్టు సంస్థ అదివారం నుంచి మరో కంపెనీ బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలిసింది. దీంతో మా వేతనాలు ఎవరిస్తారని కార్మికులు వాపోతున్నారు. అయితే ఉత్పత్తి సమయంలో ఈ ఘటన జరగటం తో సర్వత్రా భయాందోళనకు గురవుతున్నారు.