నారాయణఖేడ్ : కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.
ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి చెరువుల్లో వదలడం ద్వారా చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు, గంగపుత్రులు, ముదిరాజ్‌లు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. రజకుల లాండ్రీ షాపులు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసే ఉత్తర్వులను తీసుకొచ్చి వారిని విద్యుత్ బిల్లుల భారం నుంచి తప్పించారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు నవాబ్ఖాన్, సర్పంచ్ జగదీశ్వర్‌చారి, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్‌నాయక్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, బంజారా సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
అదేవిధంగా నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ పీహెచ్సీలో నిర్వహిస్తున్న కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. శనివారం 350 మందికి కొవిడ్ టీకా వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.