 
                                                            పటాన్ చెరు, అక్టోబర్ 31: దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దకు వచ్చే కొత్త వ్యక్తుల సమాచారం తెలుసుకోవాలని బీఆర్ఎస్ నేత ఐలాపూర్ మాణిక్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్లో (Sulthanpur) గురువారం జరిగిన దొంగతనాలపై బాధితులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని యువకులకు, వృద్ధులు, మహిళలకు దొంగతనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన దొంగతనం మరువక ముందే మరోసారి సుల్తాన్పూర్లో చోరీలు జరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.
తాళం వేసి ఉన్న ఇండ్లనే దొంగలు లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి సమయంలో ఊర్లకు వెళ్లే పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతూ కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
 
                            