Hothi Baswaraj | జహీరాబాద్ , డిసెంబర్ 7 : సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన న్యాల్ కల్కు చెందిన ప్రముఖ శిల్ప కళా కారుడు, రాష్ట్రపతితో డాక్టరేట్ ప్రశంసా పత్రాన్ని అందుకున్న, శిల్పకళా రంగంలో పలు మాస్టర్స్ డిగ్రీలను పూర్తిచేసిన ప్రముఖ శిల్పి డా.హోతి బస్వరాజ్కు మరోమారు జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.
ఈ నెల 9 నుండి 24 వరకు న్యూ ఢిల్లీలో జరగనున్న ‘జాతీయస్థాయి శిల్పకళ ప్రదర్శన’కు మరో మారు ఎంపికయ్యారు. అఖిల భారతీయ శిల్పకళా, క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రదర్శన ఈ నెల 9 నుండి న్యూఢిల్లీలోని రఫీ మార్గ్ భవనంలో జాతీయస్థాయిలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శిల్ప కళాకారులు తయారు చేసిన అరుదైన, ప్రత్యేక శిల్పాలను ప్రదర్శించనున్నారు.
న్యాల్ కల్కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు బస్వరాజ్ రూపొందించిన అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవుని ప్రతిరూపం జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
