సంగారెడ్డి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఒ మిక్రాన్ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్‌సీల్లో కరోనా టెస్టింగ్ కిట్లు, హోం ఐసోలేషన్ కిట్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్‌రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, మంత్రి హాజరయ్యారు. ముందుగా ఇటీవల మృతి చెందిన దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌కు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అ నంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కరోనా నేపథ్యం లో జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇతర అంశాలపై చర్చ వద్దని, కేవలం వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష జరుపుతామని సభ్యులకు సూచించగా, మంత్రి ప్రతిపాదనకు సభ్యులు అంగీకరించారు. మొదట వ్యాక్సినేషన్‌పై సమీక్ష జరిపారు. వైద్య శాఖ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండో డోస్ ఇంకా 54శాతం మందికి వేయాల్సి ఉందని, టీనేజర్లకు మొదటి రోజు కేవలం 191 మందికి మాత్రమే వేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సరైన సమాచారంతో రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో బస్తీ దవాఖానలు..
కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉండడంతో జిల్లాకు రెండు లక్షల కరోనా టెస్టింగ్ కిట్లు, లక్ష హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కరోనాను నుంచి జిల్లా ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. ప్ర జలు ఒమిక్రాన్ విషయంలో భయభ్రాంతులకు గురికావద్ద ని సూచించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వే సుకొని, కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఒమిక్రాన్ దరిచేరదన్నారు. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా నాలుగు బస్తీ దవాఖాన లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సంగారెడ్డి, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్‌లో త్వరలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
సంగారెడ్డి జిల్లాలో వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించా రు. ఇందుకోసం అవసరమైతే ఎమ్మెల్యేలు, మండల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లా లో మొదటి డోస్ వ్యాక్సిన్ వందశాతం పూర్తయినా, రెండో డోస్ ఇంకా 5 లక్షల మంది తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే టీనేజర్లు 82వేల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇకనైనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా 5 లక్షల మందికి రెండో డోస్ వేయాలని సూచించారు. అలాగే 82వేల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేయాలన్నారు. అవసరమైతే ఆదివారాలు వ్యాక్సిన్లు వేయాలని, సెలవులు తీసుకోవద్దని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల్లో టీనేజర్లు ఉంటారని, వారికి అక్కడే వ్యాక్సిన్ వేయాలని సూచించారు. 60ఏండ్ల వయస్సు పైబడిన రెండు లక్షల మందికి బూస్టర్ డోస్‌లు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల్లో వైద్య సిబ్బందితో సమావేశమై వ్యాక్సినేషన్ వందశాతం పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డికి సూచించారు. ఇక నుంచి వ్యాక్సినేషన్‌పై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలని కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషాను సూచించారు. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ప్రతి పీహెచ్‌సీని సందర్శించాలని, ప్రోగ్రాం ఆఫీసర్లకు వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించాలని డీఎంహెచ్‌వో గాయత్రీదేవికి ఆదేశించారు.
అందుబాటులో అన్ని సౌకర్యాలు..
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ప్రైవేటుకు వెళ్లవద్దని, ప్రభుత్వ వైద్యం పొందాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. జిల్లా లో ఎక్కడా ఒక్క డాక్టర్ పోస్టు ఖాళీ లేదన్నారు. ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే డాక్టర్లను నియమించుకునే అధికారం కలెక్టర్లకు అప్పగించినట్లు చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో సా ధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. తమ ప్రాంతాల్లోని గర్భిణులు తప్పకుండా ప్రభుత్వ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకునేలా జడ్పీటీసీలు, ఎంపీపీలు చొరవ తీసుకోవాలన్నారు.
నియోజకవర్గాల వారీగా సమీక్ష
జడ్పీ సమావేశంలో నియోజకవర్గాల వారీగా దవాఖానల సదుపాయాలు, సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి ఏరియా దవాఖానలో ఆర్టీపీసీఆర్ సెంటర్‌ను నిర్వహించాలని కలెక్టర్, డీసీహెచ్ఎస్కు సూచించారు. ఆక్సీజన్ బెడ్లు 400, ఆక్సీజన్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా దవాఖానలో ఇది వరకు 30 వెంటిలేటర్లు ఉన్నాయని, కొత్తగా మరో 20 వెంటిలేటర్లను మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా సీటీ స్కాన్‌తో పాటు 50 పడకల ఐసీయూ, ఈ-ఐసీయూలు సేవలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ-ఐసీయూ ద్వారా నిమ్స్ వైద్యులు ఆన్లైన్లో ఇక్కడి రోగులకు వైద్యసేవలు అందజేయడం జరుగుతుందన్నారు. నారాయణఖేడ్‌లో వంద పడకలు ఏర్పా టు చేయాలని డీసీహెచ్ఎస్కు సూచించారు. జహీరాబాద్, మిర్జాపూర్ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బిలాల్పూర్ పీహెచ్సీ ప్రారంభానికి వీలుగా వెంటనే సిబ్బంది నియమించడంతో పాటు ఫర్నిచర్ ఏర్పా టు చేయాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో సౌకర్యాల కోసం రూ.8.5 లక్షలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
అందోలులో వందపడకలతో పాటు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కోరా రు. మంత్రి స్పందిస్తూ జోగిపేటలో వందపడకలు ఏర్పాటు చేస్తామని, డయాలసిస్ సెంటర్‌కు ప్రతిపాదనలు పంపాలని వైద్యాధికారులకు సూచించారు. జోగిపేటలో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు, ఐసీయూ, ఆక్సీజన్ బెడ్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. మునిపల్లి పీహెచ్సీలో అదనపు సౌకర్యాలు కల్పించాలని జడ్పీటీసీ మీనాక్షి కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. పటాన్చెరు దవాఖానలో కొత్తగా సీటీస్కాన్, సీ-ఆర్మ్ థియేటర్‌తో పాటు మినీ డయాగ్నోసిస్ హాబ్ మంజూరైనట్లు చెప్పారు. ఈ మూడు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి సూచించారు. జడ్పీ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.30 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు త్వరలో కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అలాగే, ఎంపీపీలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు చంటిక్రాంతి కిరణ్, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, జగ్గారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా అధికారులు, జడ్పీటీసీ, ఎంపీపీలు పాల్గొన్నారు.