పటాన్చెరు టౌన్, మే 13 : ప్రజల సహకారంతోనే సంపూర్ణ పారిశుధ్యం సాధ్యం అవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట భారతీనగర్ , పటాన్చెరు, రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్ల పరిధిలో చెత్త సేకరణకు రూ. 85లక్షల విలువతో కూడిన 10 ఆటో ట్రాలీలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నగరంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షన్లో పారిశుధ్యం మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఇప్పటికే ఆటోలు ప్రతి కాలనీకి, బస్తీకి సేవలు అందజేస్తున్నాయని, పెరుగుతున్న నూతన కాలనీలకు చెత్త ఆటోలను పంపుతున్నామన్నారు. తడిచెత్త, పొడి చెత్త విడదీసి ఇస్తేనే పనిభారం తగ్గుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజలు తాము అందజేసే చెత్తను విడివిడిగా ఇస్తే వాటిని తిరిగి పునర్వినియోగించవచ్చన్నారు. పారిశుద్య నిర్వహనలో మూడు డివిజన్లు ముందున్నాయన్నారు. ముగ్గురు కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. పారిశుద్యం, వీధిలైట్లు, తాగునీటి సరఫరాలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, సింధురెడ్డి, పుష్ప, తదితరులు పాల్గొన్నారు.