పటాన్చెరు, నవంబర్ 1: గడప గడపకూ తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. వేగంగా విస్తరిస్తున్న రాజధాని హైదరాబాద్ నగర జనాభాకు సరిపోను తాగునీటి వనరులను నిర్మించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. విశ్వనగరం పరిధి ఓఆర్ఆర్ను దాటి విస్తరిస్తుండడంతో కొత్త పట్టణాలు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు మేజర్ పంచాయతీలుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు పట్టణాలుగా మారాయి. ఆ ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాను చూసి మున్సిపాలిటీలుగా ప్రభుత్వం మార్చింది. రింగురోడ్డు లోపల సంగారెడ్డి జిల్లాలో బొల్లారం, అమీన్‌ఫూర్, తెల్లాపూర్ పట్టణాలు మున్సిపాలిటీలుగా మారాయి. జిల్లాలోనే అధిక జనాభా ఉన్న పట్టణాలుగా ఈ మూడు మున్సిపాలిటీలు శరవేగంగా అభివృద్ధి సాధించాయి. పెరుగుతున్న ఈ పట్టణాల్లో ప్రతి ఒక్కరి దాహం తీర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. 18 మిలియన్ లీటర్ల నిలువ సామర్ధ్యంతో రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి రూ.197 కోట్లు ఖర్చు చేయనున్నది. 364 కిలోమీటర్ల మేర కొత్తగా నీటి పైప్లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హెచ్ఎండబ్ల్యూ శాఖ అధికారులతో మూడు మున్సిపాలిటీల్లో 3 మిలియన్ లీటర్ల సామర్ధ్యంతో నిర్మించనున్న రిజర్వాయర్ల కోసం స్థలాలను పరిశీలించారు.
పాతికేళ్ల అవసరాలను తీర్చేలా..
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అమీన్‌ఫూర్, బొల్లారం, తెల్లాపూర్‌లో ఐదేసి ఎకరాల స్థలాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర శివారులో అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నది. రూ.1200 కోట్ల ఖర్చుతో 137 మిలియన్ లీటర్ల నిల్వ నీటి సామర్ధ్యం కల్గిన రిజర్వాయర్లను నిర్మించేందుకు ఓఆర్ఆర్ ఫేస్-2కు ఆమోదముద్ర వేసింది. రూ.137 కోట్ల ఖర్చుతో బొల్లారం, అమీన్‌ఫూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల్లోనూ 18 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కల్గిన రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక అమలుచేస్తున్నది. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇప్పటికే అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారంలో 30 లక్షల లీటర్ల సామర్ధ్యంతో మూడు వేర్వేరు రిజర్వాయర్లు నిర్మించేందుకు స్థలాలు పరిశీలించారు. ఇప్పటికే ఎమ్మెల్యే 90లక్షల లీటర్ల సామర్ధ్యంతో మూడు రిజర్వాయర్ల కోసం స్థలాలను పరిశీలించారు. మరో 90లక్షల లీటర్ల నిలువ సామర్ధ్యంతో మరిన్ని రిజర్వాయర్లు నిర్మిస్తారు. వచ్చే పాతికేళ్ల వరకు పెరుగుతున్న జనాభాకు నీటి అవసరాలు తీరేలా డిజైన్ చేస్తున్నారు. దాదాపుగా 364 కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేయడం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తారు. ఫేజ్-1లో ఇప్పటికే ఈ పట్టణాల్లో పైప్లైన్లు వేశారు.
ఇప్పుడు కొత్త కాలనీలకు కొత్తగా పైప్‌లైన్ వేసి రిజర్వాయర్ల సాయంతో సురక్షితమైన తాగునీటిని అందజేస్తారు. అమీన్పూర్ జనాభా దాదాపు 2లక్షల వరకు ఉండడంతో ఇప్పుడు అందజేస్తున్న తాగునీరు అందరికీ సరిపోవడం లేదు. పదేండ్ల కాలంలో అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం పట్టణాలు మూడింతల జనాభా పెరిగి తాగునీరు అందజేయడం సమస్యగా మారాయి. శరవేగంగా విస్తరిస్తున్న కాలనీలు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. హైదరాబాద్ నగర శివారులో ఉండడంతో ఐటీ ఉద్యోగులు, ఫార్మా ఉద్యోగులు, చిరువ్యాపారులు ఈ మూడు పట్టణాల్లో నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమీన్పూర్ పట్టణం జనాభాతో కిటకిటలాడుతున్నది. ఇప్పటికి కొత్త కాలనీల్లో తాగునీరు అందజేయలేకపోతున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనడం ఈ కాలనీవాసులకు అలవాటుగా మారింది. ఇప్పుడు ప్రతి గడపకూ తాగునీటిని అందజేయాలని ప్రభుత్వం ముందుకు పోతున్నది.
కొల్లూరుకు శరవేగంగా రిజర్వాయర్..
కొల్లూరు గ్రామం తెల్లాపూర్ మున్సిపాలిటీలోకి వస్తున్నది. కొల్లూరులో 16,500 డబుల్ బెడ్రూమ్లతో సముదాయాన్ని ప్రభుత్వం నిర్మించింది. దాదాపుగా ఇక్కడ 70వేల వరకు జనాభా నివసించనున్నది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉండేవారికి తాగునీరు నిరంతరం అందజేయడానికి పెద్ద ప్రణాళికనే సిద్ధం చేయాల్సి వస్తున్నది. 30లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ కోసం కొల్లూరులోని సర్వే నెంబర్ 203లో స్థలాన్ని పరిశీలించారు. ఐదెకరాల స్థలంలో భారీ రిజర్వాయర్ నిర్మిస్తారు. ఈ నీటితోనే ఉస్మాన్‌నగర్ దాహార్తిని తీరుస్తారు. హెచ్ఎండబ్ల్ల్యూఎస్ ద్వారా నిర్మాణ పనులు చేపడతారు. కొత్తగా వచ్చే 70వేల జనాభాకు తక్షణమే నీటిని అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఉస్మాన్‌నగర్, కొల్లూర్, నాగులపల్లి, వెలిమెల, తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈ ప్రాంతం కూడా వేగంగా విస్తరిస్తున్నది. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. వేలాది జనాభా వలస వస్తున్నది. అమీన్‌ఫూర్ మున్సిపాలిటీలో 140 వరకు కాలనీలు ఏర్పడ్డాయి. ఈ పదేండ్ల కాలంలో వంద కాలనీలు ఏర్పడినట్టు సమాచారం. బొల్లారంలోను భారీగా కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. భారీగా వచ్చిన ప్రజలకు తాగునీరందించడం స్థానిక వ్యవస్థలకు తలకు మించిన భారంగా మారింది.
ప్రభుత్వం హెచ్ఎండబ్ల్యూఎస్కు బాధ్యతలు అప్పగించడంతో సమస్య పరిష్కారానికి నోచుకుంటున్నది. హైదరాబాద్ మహానగరానికి నిర్విరామంగా తాగునీరు అందజేసిన చరిత్ర హెచ్ఎండబ్ల్యూఎస్కు ఉండడంతో ఈ మూడు మున్సిపాలిటీల నీటి సరఫరా వ్యవస్థ కూడా సక్రమంగా జరుగుతుందని భావిస్తున్నారు. గోదావరి నీటితో పాటు అవసరం ఉన్నచోట మంజీరా నీటిని కూడా వాడి రింగురోడ్డు చుట్టు ఉన్న పట్టణాల దాహార్తిని తీరుస్తారు. దాదాపుగా మరో పాతికేళ్ల పాటు అవసరాలు తీర్చేలా రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అమీన్పూర్ వంటి పట్టణాల్లో 30లక్షల లీటర్ల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్‌నుంచి నిరంతరం అమీన్‌ఫూర్ పట్టణానికి తాగునీరు అందజేస్తున్నారు. ఇప్పుడు అదనంగా నిర్మిస్తున్న మరో 30లక్షల లీటర్ల నీటి రిజర్వాయర్‌తో పట్టణంలో మరిన్ని కాలనీలకు సరఫరా చేస్తారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి అధికారులు సేకరించారు. బొల్లారంలోనూ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 18 మిలియన్ లీటర్ల సామర్ధ్యంతో నిర్మించే రిజర్వాయర్లు తెలంగాణ ప్రభుత్వం ముందు చూపునకు నిదర్శనంగా చెప్పవచ్చు.
కాలనీ వాసుల్లో ఆనందం ..
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అమీన్పూర్ వచ్చి రిజర్వాయర్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు. దీంతో హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్, ఆర్టీసీ కాలనీ వాసుల్లో ఆనందం కనిపిస్తున్నది. బీరంగూడ, అమీన్పూర్లో తాగునీటిని అందజేయగలుగుతున్నాం. కొన్ని కాలనీలకు నీటి సరఫరాకు ప్రతిబంధకాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త రిజర్వాయర్లతో అమీన్పూర్ మున్సిపాలిటీలోని ప్రతి కాలనీకి సురక్షితమైన తాగునీరు అందనున్నది.
-తుమ్మల పాండురంగారెడ్డి, చైర్మన్. అమీన్పూర్ మున్సిపాలిటీ
భవిష్యత్తు అవసరాలు తీర్చేలా..
రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు అవసరాల కోసం తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. 30లక్షల లీటర్ల సామర్ధ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో కొల్లూర్తో పాటు అన్ని వార్డులకు తాగునీరు లభించనుంది. కొల్లూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాల్లో 60-70వేల జనాభా నివసించే అవకాశం ఉంది. వారందరికీ తాగునీరు అందనుంది. కొత్తగా నిర్మాణం అవుతున్న గేటెడ్ కమ్యూనిటీలకు సురక్షితమైన జలం సరఫరా కానున్నది.
-లలిత సోమిరెడ్డి, చైర్పర్సన్, తెల్లాపూర్ మున్సిపాలిటీ
కాలుష్యం నీటికి చెక్ ..
బొల్లారం అంటేనే పరిశ్రమల కాలు ష్యం. తెలంగాణ ప్రభుత్వం నూతనం గా నిర్మిస్తున్న రిజర్వాయర్‌తో అన్ని కాలనీలకు, బస్త్తీలకు తాగునీరు అందనున్నది. ఇండస్ట్ట్రియల్ ఏరియా కావడంతో ఏటా జనాభా పెరుగుతున్నది. కొత్త రిజర్వాయర్లతో భవిష్యత్తు అవసరాలు తీరుతాయి. ముందు చూపుతో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్లు అందరి దాహం తీరుస్తాయి. ఇటు కాలుష్య సమస్యకు చెక్‌పెడుతూ సురక్షితమైన నీటిని ప్రజలకు ఇవ్వబోతున్నాం.
-కొలన్ రోజా బాల్‌రెడ్డి, చైర్పర్సన్, బొల్లారం మున్సిపాలిటీ
నీటి ఎద్దడి ఉండదు..
అమీన్‌ఫూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీల్లో 3మిలియన్ లీటర్ల సామర్ధ్యంతో మూడు రిజర్వాయర్లు నిర్మించేందుకు స్థలాలు పరిశీలించాం. త్వరలో స్థలాలను సేకరించే ప్రక్రియ పూర్తి చేసి రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తాం. 18 మిలియన్ లీటర్ల సామర్ధ్యంతో పటాన్చెరు నియోజకవర్గంలోని రింగురోడ్డు మున్సిపాలిటీలు, గ్రామాలకు తాగునీరు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. సీఎం కేసీఆర్ ముందు చూపు కారణంగా మూడు మున్సిపాలిటీల్లో దాహం అనేది ఉండదు. కొల్లూర్‌లోని డబుల్ బెడ్రూమ్లలో నివసించే ప్రజలకు పుష్కలమైన నీరు అందనున్నది. ప్రభుత్వం సురక్షితమైన నీటిని అందజేసే వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటున్నది. పెరుగుతున్న జనాభాకు సరిపడా నీటిని అందిస్తుంది.
-గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే పటాన్చెరు