
చేర్యాల, ఆగస్టు 23 : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో మహా మండప విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.2.20లక్షల వ్యయంతో చేపట్టే మండప విస్తరణ, రూ.50లక్షలతో పాకశాల(స్వామి వారి నివేదన తయారీ గృహం) పనులకు టెండర్లు ముగిశాయి. కాగా, కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఆలయవర్గాలు చర్యలు తీసుకుంటున్నాయి. మల్లన్న ఆలయ నిధులు రూ.2కోట్ల70లక్షల వ్యయంతో మహామండపాన్ని విస్తరణ, పాకశాల నిర్మాణాలకు ఆలయవర్గాలు ఐదు నెలల క్రితం ప్రతిపాదనలు తయారు చేయించి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అందజేయడంతో, ఆయన వాటిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేశారు. మండపంతో పాటు రూ.50లక్షల వ్యయంతో ప్రస్తుతం ప్రసాదాల తయారీ, విక్రయ ప్రదేశాల ప్రాంతంలో ఆధునిక వసతులతో పాకలశాల నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న భక్తులకు సంఖ్యకు అనుగుణంగా ఆలయంలో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ది. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను పరిశీలించి, ఓకే చేయడంతో ఆలయవర్గాలు ఇటీవల ఆన్లైన్లో టెండర్లు పిలిచారు. కాగా, హైదారబాద్‌కు చెందిన రామమంత్ర ఇన్ఫ్రా అండ్ అగ్రోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తక్కువ ధరకు పనులు చేసేందుకు కోడ్ చేసి పనులు చేసే హక్కులను ఆన్లైన్ టెండర్లో దక్కించుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి సైతం పనులను త్వరితగతిని పూర్తి చేయించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మండప విస్తరణతో భక్తులకు వసతి
మల్లన్న ఆలయంలో ప్రస్తుతం ఉన్న మహా మండపంలో స్వామి వారి నిత్య కల్యాణం చేసేందుకు అటు అ ర్చకులు, ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలతో పాటు ఆదివారం రోజుల్లో పట్నాలు వేసేందుకు ఒగ్గు పూజారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లన్న ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చి నిత్య కల్యాణం మొక్కు తో పాటు ముఖమండప పట్నం వేసి మొక్కులు తీర్చుకునేందుకు మండపానికి వెళితే, అక్కడ ఖాళీ ప్రదేశం లేక గంటల పాటు వారు వేచి ఉండాల్సి వస్తున్నంది. ఇక బ్ర హ్మోత్సవాల సమయంలో ఒకరిపై ఒకరు కూర్చోవాల్సి న పరిస్థితులు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి న భక్తుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భక్తులు, అర్చకులు, ఒగ్గు పూజారుల సమస్యను పరిష్కరించి, భక్తులు మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ మొక్కులు తీర్చుకునేందుకు మండప విస్తరణకు ఆలయవర్గాలు శ్రీకారం చుట్టడడంతో పలువురు భక్తులు ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. మహామండప విస్తరణతో భక్తులకు మేలు జరుగనుందని పలువురు అభిప్రాయపడుతు న్నారు. ప్రస్తుతం ఉన్న మండపం పక్కనే మరో మండపాన్ని నిర్మించడంతో ఓ మండపంలో స్వామి వారికి నిత్య కల్యాణం మొక్కుల పూజలు, మరో మండపంలో భక్తులు పట్నాలు వేసుకునే అవకాశం కలుగుతుండడంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగునున్నది.
నిత్య కల్యాణానికి తప్పనున్న తిప్పలు
బ్రహ్మోత్సవాల సమయంలో ఆదివారం రోజున మండపంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులకు స్వామి వారికి కల్యాణం జరిపించే మొక్కు కోసం మరుసటి రోజు(సోమవారం) వరకు వేచి ఉండాల్సి వస్తున్నది. ఇక మండప విస్తరణ జరగనుండడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదివారం రోజునే వారి స్వామి వారి నిత్య కల్యాణంలో పాల్గొని, మొక్కు తీర్చుకునే అవకాశం కలుగుతుంది. దీంతో భక్తులు నిత్య కల్యాణోత్సవ మొక్కులు తీర్చుకునేందుకు ఒక్క రోజు పాటు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒకే రోజులో మొక్కులు తీర్చుకునే అవకాశం కలుగుతుంది.