సదాశివపేట, ఫిబ్రవరి 13: సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ… అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పటికీ బీఆర్ఎస్కు గణనీయమైన స్థానాలు ఇచ్చారన్నారు.
మున్సిపల్ ఎన్నికల కోసం అహర్నిశలు కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులకు దన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నిస్వార్థంగా బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం శ్రమించారన్నారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి, సదాశివపేట పట్టణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, ప్రతి వార్డుకు రూ. 8 కోట్లు ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటించిందన్నారు.
దీని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సంగారెడ్డి పట్టణానికి రూ. 304 కోట్లు, సదాశివపేట పట్టణానికి రూ. 208 కోట్లు మొత్తం రూ. 512 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రెండు పట్టణాలలో పేదల కోసం పది వేల ఇండ్ల స్థలాలు, పది వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రెండు పట్టణాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ప్రారంభించిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రభు త్వం నుంచి నిధులు తెస్తారనే విశ్వాసంతో ప్రజలు ఆ పార్టీకి ఓటేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మెలే చింతా ప్రభాకర్ కోరారు.