సంగారెడ్డి, మార్చి 5: సంగారెడ్డి జిల్లా కందిలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)ను ప్రైవేట్‌కు అప్పగించిన బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డిలోని డీసీఎంఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి 1983లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఓడీఎఫ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అప్పట్లో రైతులను ఒప్పించి కర్మాగారం ఏర్పాటుకు భూములు తీసుకున్నారని, ఈ ప్రాంత రైతులు ఎంతో ఉదారతతో 3200 ఎకరాల సాగు భూమిని పరిశ్రమను నెలకొల్పేందుకు ఇచ్చారన్నారు. అర్హతలను బట్టి అప్పట్లో ఉద్యోగాలు ఇచ్చి రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపితే, ఇప్పుడు ప్రధాని మోదీ పరిశ్రమను ప్రైవేటుపరం చేసి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం జాతి సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదన్నారు.
ఓడీఎఫ్ పరిశ్రమను తీసుకున్న యాజమాన్యం దవాఖానను నడపలేమని గాలికొదిలేసిందని, కేంద్రం ప్రైవేటు యాజమాన్యానికి ఎలా ఇచ్చిందని ఎంపీ ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్లో 20శాతం ఉద్యోగులను తొలిగించారని, 2 వేల మంది ఉద్యోగ విరమణ పొందితే కొత్తగా నియామకం చేయలేదని, ఓడీఎఫ్‌లో 2 వేల మందిని నియామకం చేయకుండా మొండివైఖరి అవలంబిస్తున్న కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామకం చేస్తలేదని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తాము రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తితే, మన బీజేపీ ఎంపీలు మద్దతు తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడీఎఫ్‌లో కొనసాగుతున్న దవాఖానను రాష్ర్టానికి అప్పగిస్తే ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడుకుంటామని ఎంపీ ప్రకటించారు. ప్రభుత్వరంగం సంస్థల కార్పొరేటీకరణపై కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రితో చర్చిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, త్వరలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. అంతకుముందు ఓడీఎఫ్ దవాఖాన ఉద్యోగులు, వైద్యసిబ్బంది ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని కలిసి దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.