న్యాల్కల్, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో రెండో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ సరస్వతీ మాత పంచవటీ క్షేత్రం వసంత పంచమికి సిద్ధమైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో సరస్వతీ అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా నేటి నుంచి ఆలయంలో వేదపండితులు కుంకుమార్చన, అభిషేకం, సరస్వతీ యాగం, హారతి తదితర పూజలు నిర్వహించనున్నారు. మం జీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. క్షేత్ర ఆవరణలో వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల మధ్య వేంకటేశ్వరస్వామి, భూదేవి, లక్ష్మీమాతల విగ్రహాల ప్రతిష్ఠాపన చేయనున్నారు. క్షేత్రంలోని సరస్వతీ అమ్మవారితో పాటు సాయిబాబా, సూర్యభగవాన్, గంగమాతను భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించేందుకు క్షేత్రంలో ఏర్పాట్లు చేశారు. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో భాజాభజంత్రీల హోరు, భజన కీర్తనల మధ్య భక్తులతో కలిసి ఊరేగింపుగా మంజీరా నదికి తరలివెళ్లి, నదిలో తెప్పను విడిచి గంగామాతకు మహాహారతి చేపట్టనున్నారు. జిల్లా నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వందలాది బోనాలతో తరలివచ్చిన మహిళలు నది వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మహిళలు బోనాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై సరస్వతీ అమ్మవారిని ఊరేగింపు చేపట్టానున్నారు. 6వ తేదీన సరస్వతీ అమ్మవారికి డోలారోహణం, 7న రథసప్తమిని పురస్కరించుకొని క్షేత్రంలోని సూర్యభగవాన్‌ను ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంలో ఊరేగింపు నిర్వహిస్తా మని కాశీనాథ్‌బాబా పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా షామియాలు, తాగునీరు, అన్నదానం, వాహనాల పార్కింగ్ తదితర సదూపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జహీరాబాద్ రూరల్ సీఐ భరత్‌కుమార్ ఆధర్యంలో హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కాశీనాథ్‌బాబా కోరారు.
వసంత పంచమి పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని బోరంచమ్మ ఆలయ ప్రాంగణంలో గల సరస్వతీ ఆలయంలో తెల్లవారుజామున నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నారాయణ తెలిపారు. సరస్వతీ శిశుమందిర్‌లో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించనున్నారు.
మండలంలోని పేరూరు గ్రామ శివారులోని మంజీరా తీరంలో వెలిసిన గరుడగంగ సరస్వతీ మాత ఆలయంలో శనివారం వసంత పంచమి పురస్కరించుకుని వేడుకలు వైభవంగా నిర్వహించనున్నటు పూజారి తెలిపారు. అమ్మవారికి మహాబలాభిషేకం, అలంకారం, సరస్వతీ యజ్ఞం, పూర్ణాహుతి, చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు, ఒడిబియ్యం, సాయంత్రం బండ్ల ఊరేగింపు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటాయని ఆలయ పూజారి దోర్బల రాజమౌలి శర్మ తెలిపారు.