చేర్యాల, ఆగస్టు 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో గురువారం దేవాదాయశాఖ భూపరిపాలన విభాగం స్పెషల్ గ్రేడ్ అదనపు కలెక్టర్ రమాదేవి పర్యటించారు. కొమురవెల్లికి వచ్చిన ఆమె మొదటగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ రాజగోపురం పక్కన నూతనంగా క్యూకాంప్లెక్స్ నిర్మాణానికి అవసరమయ్యే ప్రదేశాలతో పాటు కాంప్లెక్స్ నిర్మించే ప్రదేశంలో ఉన్న వారికి మరో చోట కేటాయించే భూమిని పరిశీలించారు. రెండు ప్రదేశాల విలువ తదితర వాటిని రెవె న్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూకాంప్లెక్స్ నిర్మాణ ప్రదేశంతో పాటు భూ నిర్వాసితులకు కేటాయించే స్థలాన్ని వెంటనే నివేదికను తయారు చేసి తమకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తాను మల్లన్న క్షేత్రంలో పర్యటించినట్లు, ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చే నివేదికలను పరిశీలించి మరో నివేదిక తయారు చేసి కమిషనర్‌కు అందజేస్తానని తెలిపారు. ఆమె వెంట ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఏఈవో అంజయ్య, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, డైరెక్టర్లు ఉట్కూరి అమర్‌గౌడ్, ముత్యం నర్సింహులు, దినేష్తివారి, చింతల పరశురాములు, తాళ్లపల్లి శ్రీనివాస్, పొతుగంటి కొమురవెల్లి, బొంగు నాగిరెడ్డి, డీఈ రాజేశ్వర్‌రావు ఉన్నారు.