నర్సాపూర్, ఏప్రిల్ 27 : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోడానికి రైతన్నలకు గిడ్డంగులు తప్పనిసరి. ఒకప్పుడు ధాన్యాన్ని నిల్వ చేసుకోడానికి గిడ్డంగులు లేక ఇంట్లో, లేదా పొలాల వద్ద నిల్వ చేసుకోనేవారు. పండించిన పంటను పొలంలోనే దళారులకు అమ్మి నష్ట పోయేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిడ్డంగుల సామర్థ్యాలను పెంచి రైతన్నలకు అండగా నిలిచింది. ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఎక్కువ సామర్థ్యంతో కూడిన గిడ్డంగులను నిర్మించారు.
నర్సాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో 27వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములు అన్నదాతలకు అందు బాటులో ఉన్నాయి. గిడ్డంగులు నిర్మించిన తర్వాత పీఏసీఎస్ వారు గిడ్డంగులను ఉపయోగించుకుని ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మార్కెట్ కమిటీ తరుపున కొనుగోలు సామగ్రిని అందించారు. వీటితో పాటు రైతులకు ప్యాడీ మిషన్, మ్యాచర్ మిషన్, కాంటాలు, టార్పాలిన్లు అందించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల రైతులు ఈ మార్కెట్ యార్డులో ధాన్యాన్ని విక్రయించి మంచి ధరను పొందుతున్నారు.
చివరి గింజ వరకూ కొంటాం..
రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నాము. రైతులకు కనీస సౌకర్యాలను కల్పిస్తూ ధాన్యం సేకరిస్తున్నాము. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికే 50శాతం సామగ్రిని అందజేశాము. మిగతా సామగ్రిని త్వరలోనే అందిస్తాము. చివరి గింజ వరకు కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మంచి ధరను పొందాలి.
– అనసూయఅశోక్గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్
ఎప్పుడు ఇక్కడే అమ్ముతా..
యాసంగి, వానకాలంలో పండించిన పంటను మార్కె ట్యార్డులోనే అమ్ముతాను. ఇక్కడ మంచిగా తూకం వేస్తా రు. మద్ధతు ధరతో పాటు ఎటువంటి మోసం ఉండదు. అంతే కాకుండా వాన పడితే ధాన్యం తడుస్తాదనే భయం అసలే లేదు. టార్పాలిన్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటా యి. వడ్లు దాచుకోడానికి పెద్దపెద్ద గోదాములున్నాయి. సిబ్బంది కూడా సహకరిస్తారు.
– లక్ష్మణ్, రైతు మూసాపేట్