పటాన్చెరు, ఏప్రిల్ 2 : ముస్లింల పవిత్ర మాసం రంజాన్ నెలవంక దర్శనంతో ప్రారంభమైంది. ప్రత్యేక ప్రార్థనల కోసం మసీదులు ముస్తాబు కాగా, మార్కెట్లలో పండుగ వాతావరణం మొదలైంది. ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించింది. దీనికి ప్రతీకగా ఈ మాసంలో ఉపవాసాలు ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి, ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. రంజాన్ సందర్భంగా స్థానికంగా ఉన్న అన్ని మసీదులను ప్రత్యేక ప్రార్థనల కోసం ముస్తాబు చేస్తున్నారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంచి విషయాలను మసీదు కమిటీలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం విషయాల్లో మసీదు కమిటీలను సహకరిస్తున్నాయి. నెల రోజుల పాటు జరిగే రంజాన్ ఉపవాసదీక్షలు సజావుగా జరగాలని మతపెద్దలు కోరుకుంటున్నారు.
ఇఫ్తార్ల జోరు
రంజాన్ నెల అనగానే ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస దీక్షల తరువాత జ్ఞాపకం వచ్చేది ఇఫ్తార్ విందులే. రంజాన్‌లో ఉపవాస దీక్ష చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడానికి భక్తులు పోటీ పడుతారు. సాయంత్రం ప్రార్థనలు చేసి ఉపవాస దీక్ష వదిలినవారికి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడంలో ముస్లింలతో పాటు హిందువులు ముందుంటారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మన గంగాజమున తెహజీబ్‌ను గుర్తుకు తెస్తారు. ఇఫ్తార్ తర్వాత మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలు జరుగుతాయి.
జకాత్(ధర్మాలు) తప్పని సరి
రంజాన్ మాసంలో జకాత్ తప్పని సరి. తమ ఆదాయంలోంచి ఎంతో కొంత నిరుపేదలకు జకాత్(దానం) చేస్తుంటారు. జకాత్ గురించి ఖురాన్లో 30 అధ్యాయాల్లో వివరించారు. జకాత్ అంటే వ్యక్తి తాను సంపాదించిన ఆదాయం ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా తన ఆదాయంలో నుంచి కొంత పేదలకు కచ్చితంగా దానధర్మాలు చేయాలని, అది పేదల హక్కు అని ఖురాన్లో స్పష్టంగా పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పండుగ కంటే ముందుగానే పేదలకు తప్పని సరిగా దానధర్మాలు చేస్తారు. రంజాన్ చివరి వారంలో ఏదో ఒక రోజు షబే ఖద్ ఉంటుందని, ఆ రోజే ఖురాన్ అవతరించిందని విశ్వసిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి, తమ పాపాలను క్షమించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. అనంతరం రెండు రోజు లు ముందుగా ఫిత్రా దానాలు చేస్తారు. ఫిత్రా అంటే రంజాన్ పండుగను చేసుకోలేని నిరుపేదలను గుర్తించి వారికి తమ కుటుంబ సభ్యుల పేరున పండుగ ఖర్చులు ఇస్తారు. ఆ తర్వాత నెలవంక కనిపించగానే ఈద్-ఉల్ -ఫితర్ (రంజాన్)పండుగను చేస్తారు.
హలీం సందడి
రంజాన్ నెల అనగానే రుచికరమైన హలీం అందరికీ జ్ఞాపకం వస్తుంది. ఉపవాస దీక్ష చేస్తున్న ము స్లింలు పొట్టేలు మాంసం, చికెన్‌తో చేసే హలీం తినేందుకు ఆసక్తి చూపుతారు. ఉపవాసదీక్షతో శక్తిని కోల్పోయిన దీక్షదారుల్లో నూతన శక్తిని హ లీం నింపుతుందని భావిస్తారు. హలీమ్‌ను హిం దువు, ముస్లింలు తేడాలేకుండా తింటున్నారు.
ముస్లిం లకు మంత్రి రంజాన్ మాస శుభాకాంక్షలు
సిద్దిపేట, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లి విరియాలని ఆకాక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం విశిష్టత అన్నారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలు నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎండ నుంచి జాగ్రతలు తీసుకోండి
ఈ మారు మండు వేసవిలో రంజాన్ రావడంతో బయట తిరిగితే డీ హైడ్రేషన్ అయ్యే అవకాశాలున్నాయి. ఎండలో వెళ్లకుండా నీడలో ఉండేలా జాగ్రతలు తీసుకోవాలని కోరుతున్నా. రోజాలో మంచి నీరు తీసుకోకపోవడంతో దీక్ష కఠినంగా కొనసాగే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరమైన జాగ్రతలు తీసుకుంటే రంజాన్ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తవుతుంది. ఉదయం, సాయంత్రం బయట పనులు చూసుకోవాలి. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు డాక్టర్‌ను సంప్రదించి, మందులు వాడాలి. పవిత్ర మాసం రంజాన్ ఉపవాసాలు అందరూ విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నా.
– ఖాదర్ మొహియుద్దీన్, బీహెచ్ఈఎల్ రిటైర్డ్ భద్రతా అధికారి