సంగారెడ్డి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఏటా పంటసాగు పెట్టుబడి పెరుగుతూనే ఉన్నది. దుక్కులు దున్నటం మొదలుకుని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, కూలీల ధరలు, పంటనూర్పిళ్ల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రైతులుపై పెట్టుబడి భారం ఏటా పెరుగుతున్నది. రైతులు పంటరుణాల కోసం బ్యాంకర్ల వైపు చూస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం పెరిగిన సాగు పెట్టుబడులకు అనుగుణంగా రుణ పరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) పెంచడం లేదు. దీంతో రైతులకు పెట్టుబడి తిప్పలు తప్పడం లేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా ప్రతి ఎకరాకు ఇచ్చే పంటరుణం సరిపోకపోవటంతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభమైంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగును ప్రారంభించారు. దుక్కులు దున్నటం, విత్తనాలు విత్తుకోవడం, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వానకాలం సీజన్ 7.24 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వర్షాలు కురుస్తుండటంతో వానకాలం సాగు వేగంగా సాగుతోంది. రైతులు పంటల సాగు ప్రారంభించినా బ్యాంకర్లు ఇప్పటి వరకు పంటరుణాలు ఇవ్వడం ప్రారంభించ లేదు. దీనికి తోడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టేల్ లెవల్ టెక్నికల్ కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) ఖరారు చేసిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(పంటరుణ పరిమితి)పై రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏమాత్రం పెరగక పోవడమే ఇందుకు కారణం.
బ్యాంకర్లు రైతులకు ఎకరాకు ఎంత మేర పంటరుణాలు ఇవ్వాలి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) అనేది స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) ఖరారు చేస్తుంది. ఎస్ఎల్టీసీలో నాబార్డు, ప్రధాన బ్యాంకర్లు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రతినిధులు ఉంటారు. పంటల సాగుకు మొదలు పంట చేతికి వచ్చేవరకు పంటల వారీగా రైతుకు వచ్చే ఖర్చును అంచనా వేసి ఎస్‌ఎల్‌టీసీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఎస్‌ఎల్‌టీసీ ఏప్రిల్‌లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(పంట రుణ పరిమితి) ప్రకటించింది. రుణ పరిమితిని ఎస్‌ఎల్‌టీసీ ప్రధాన పంటలపై ఏమాత్రం పెంచలేదు. ఉద్యానవన పంటలపై సైతం చాలా వరకు రుణ పరిమితి పెంచలేదు. దీంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడంపై రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఎస్‌ఎల్‌టీసీ ఖరారు చేసిన రుణ పరిమితికి అనుగుణంగానే జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు పంటరుణాలు మంజూరు చేస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిమితి పెంచకపోవడంతో రైతులకు ఎకరాకు తాము ఖర్చుచేసే పెట్టుబడి కంటే తక్కువ మొత్తంలో పంటరుణం వచ్చే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వరి సాగుకు ఎకరాకు రూ.45వేల పంటరుణం ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 వేల రుణం ఇవ్వనున్నారు.
జొన్న పంటకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.19వేలు రుణం ఇవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.19వేలు రుణం ఇవ్వను న్నారు. మొక్కజొన్నకు ఎకరాకు గత ఆర్థిక సంవత్సరంలో రూ.34వేల రుణం ఇవ్వగా, ప్రస్తుతం అంతే మొత్తం ఇవ్వనున్నారు. కంది పంటపై గత ఆర్థిక సంవత్సరంలో రూ.21వేల రుణం అందజేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో అంతే మొత్తం రుణం బ్యాంకర్లు ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రైతులు సాగు చేసే పత్తిపంటపైనా బ్యాంకర్లు రుణ పరిమితి పెంచలేదు. గత ఏడాది రూ.45వేలు రుణం ఇవ్వగా ఈ ఆర్థిక సంవత్సరంలో పత్తికి ఎకరాకు రూ.46వేల రుణం ఇవ్వనున్నారు. జిల్లాలో రైతులు ఎక్కువగా సాగుచేసే పత్తి, వరి, కంది, మొక్కజొన్న, జొన్న పంటల సాగుకు పెట్టుబడి ఏటా గణనీయంగా పెరుగుతున్నది. ప్రస్తుతం పత్తి పంట సాగుకు ఎకరాకు రూ.50 నుంచి రూ.55 వేల వరకు పెట్టుబడి అవుతున్నది. బ్యాంకర్ల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మాత్రం రూ.46 వేలు ఉంది. ఎకరం వరి సాగుకు రైతులకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతున్నది. బ్యాంకర్లు వరిపై ప్రకటించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.45 వేలు ఉంది. ప్రతి పంటపై బ్యాంకర్లు ప్రకటించి రుణ పరిమితి తక్కువగా ఉంది. దీంతో రైతులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని బ్యాంకర్లు రైతులకు వందశాతం పంట రుణాలు ఇవ్వడంలో విఫలం అవుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదు. దీనికితోడు వార్షిక రుణ ప్రణాళికలో ఖరారు చేస్తున్న లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులపై ఆర్థిక భారం పెరిగి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా 31 మంది బ్యాంకర్లు రైతులకు పంటరుణాలు ఇస్తున్నారు. ఏటా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనుగుణంగా రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రతిపంటపై రూ.5వేలు తగ్గించి రుణాలు ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. దీనికితోడు పంటబీమా డబ్బులను సైతం పంటరుణంలోనే మినహాయించుకుంటున్నారు. దీంతో రైతుల చేతికి అంతంతమాత్రంగానే డబ్బులు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2725 పంటరుణాలు ఇవ్వాల్సి ఉండగా, రూ.2505 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3328 కోట్ల పంటరుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తుంది. ఈసారైనా వందశాతం పంటరుణాలను బ్యాంకర్లు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.