సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 26: విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిని తొలిగించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాతా, శిశు సంరక్షణపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధులపై నిర్లక్ష్యం వహిస్తున్న ఒక వైద్యాధికారిని విధుల నుంచి తొలగిస్తూ మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
జహీరాబాద్ ఏరియా దవాఖానలో గైనకాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ దవాఖానకు వచ్చే గర్భిణులను ప్రైవేటు దవాఖానలకు రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో డాక్టర్ అజ్మనాజ్ను విధుల నుంచి తొలిగించాలని డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవిని కలెక్టర్ ఆదేశించారు. దౌల్తాబాద్, మల్చెల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు అందజేయాలని ఆదేశించారు.
50శాతం తగ్గిన మాతా, శిశు మరణాలు
జిల్లాలో 2023-24 సంవత్సరంతో పోల్చితే 2024-25లో మాతా, శిశు మరణాలు 50శాతం తగ్గినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రిస్క్ కేసులకు ఏరియా దవాఖానలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హైరిస్క్ కేసుల్లో రెఫర్ చేస్తున్నప్పుడు వైద్యులు సమన్వయంతో సహకారం అందించుకోవాలన్నారు.
ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి వారికి తగిన సూచనలు, సలహాలు తెలియజేయాలని సూచించారు. పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్, వివిధ ప్రభుత్వ దవాఖానల వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.