విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సంగారెడ్డి కలెక్టర్ కొరడా ఝళిపించారు. ఝరాసంగం మండలం మాచునూర్‌లో అవెన్యూ ప్లాంటేషన్‌ను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పట్టకుండా, ఎండిపోయి కింద పడిపోవడం, సపోర్ట్ కట్టెలు విరిగిపోవడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్, ఎంపీవోకు చార్జీ మెమో, మాచునూర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను టర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నారాయణఖేడ్, మనూరు మండలాల్లో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు ఎంపీవోలకు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు.
జహీరాబాద్, ఫిబ్రవరి 23: మొక్కలు పెంచేందుకు నిధులు మంజూరు చేస్తే నిర్లక్ష్యంగా పని చేస్తున్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝరాసంగం ఎంపీడీవోకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎంపీవోకు చార్జీ మెమో, మాచునూర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను టెర్నినెట్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఝరాసంగం మండలంలోని మాచునూర్ శివారులో పెంచుతున్న హరితహారం రెవెన్యూ ప్లాంటేషన్‌ను కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా లేదని, నిర్లక్ష్యంగా పని చేస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోయాయి. మొక్కలకు నీళ్లు పట్టకుండా, వేర్లు పైకి తేలి ఉండడం, పడిపోవడంతో పాటు సపోర్టింగా పెట్టిన కట్టె విరిగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంచి లక్ష్యంతో హరితహారంలో రూ.లక్షలు ఖర్చు చేసి మొక్కలు పెంచుతున్నదని, మీ నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరిత గతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
సదాశివపేట, ఫిబ్రవరి 23: ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యతగా నిర్మాణ పనులు చేపట్టాలని, నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగీతం పంచాయతీ కార్యదర్శి సస్సెన్షన్
రాయికోడ్, ఫిబ్రవరి 23: మండలంలోని సింగీతం గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్సెండ్ అయినట్లు ఎంపీడీవో వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ భవన నిర్మాణాలను నిలుపుదల చేయడంలో విఫలమైనందుకు విధుల నుంచి సస్సెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.