Kandi Central Jail | కంది, ఏప్రిల్ 7: సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారం అన్ని విధాలా ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లా జైలుకు ఈ మధ్యనే సెంట్రల్ జైలు హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 ఎకరాల విస్తీర్ణంలో జైలు పరిసర ప్రాంతమంతా పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. సత్ప్రవర్తన సెంటర్‌గా పేరు పొందడంతో పాటు ఆప్కా ఉత్తమ అవార్డును కూడా అందుకున్నది. శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల ఆలోచనా విధానాలు మార్చేందుకు జైలు అధికారులు క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది, వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నారు. జైలు లోపల ఏర్పాటు చేసిన పరిశ్రమలో బెంచీలు, బల్ల్లలు తయారు చేస్తుండడంతో జైలుకు ఆదాయం సమకూరుతున్నది. జైలుకు కొద్దిదూరంలో కాశీపూర్ వద్ద జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తూ జీవిత ఖైదీలకు సిబ్బందికి ఉపాధి కల్పించి, వేతనాలు ఇస్తున్నారు. పెట్రోల్ బంక్ ద్వారా ప్రతినెలా రూ.3లక్షల వరకు జైలు శాఖకు ఆదాయం సమకూరుతున్నది.
సోలార్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధం
రూ. లక్షల్లో వస్తున్న విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు కంది జైలులో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ నిర్ణయించింది. ఇందు కోసం రూ.20లక్షల నిధులు ఖర్చు చేసి 32 కేవీ సామర్థ్యం గల మెగా సోలార్ ప్లాంట్‌ను నిర్మించారు. మరో వారం రోజుల్లో అధికారులు ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. దీంతో, ప్రతినెలా లక్షల రూపాయల విద్యుత్ బిల్లు భారం పూర్తిగా తగ్గనున్నది. అన్నిరకాల కూరగాయల సాగు జైలు ఆవరణలో నాలుగు ఎకరాల్లో అన్నిరకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. బయటి నుంచి కూరగాయలు కొనుగోలు చేయకుండా టమాటా, బీరకాయ, సోరకాయ, ముల్లంగి, బెండ, దోసకాయ, క్యాబేజీ, ఆకుకూరలను పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆధునిక పద్ధతిలో సాగు చేస్తున్నారు.
ఆరుఎకరాల్లో మామిడి తోట
ఆరు ఎకరాల్లో ఉన్న మామిడితోటతో మంచి ఆదాయం వస్తున్నది. ప్రస్తుతం, వేసవికాలం కావడంతో పలు రకాల మామిడికాయలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మామిడి సాగుతో గత సంవత్సరం రూ.75వేల ఆదాయం వచ్చింది.
Kandi01g
ఖైదీలను సత్ప్రవర్తన బాటలో నడిపించాలన్నదే ఉద్దేశం
శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు మరోసారి తప్పు చేయకుండా వారిలో సత్ప్రవర్తన కల్పించాలన్నదే జైళ్లశాఖ ఉద్దేశం. వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తూ బయటకెళ్లిన తర్వాత సొంతంగా పని చేసుకొని బతికేలా చర్యలు తీసుకుంటున్నాం. వారి ఆలోచనా విధానాలను మారుస్తూ విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతున్నాం. ఖైదీల నైపుణ్యానికి అనుగుణంగా రోజు వారి వేతనం చెల్లిస్తున్నాం.
– డి.భరత్‌రెడ్డి, సూపరింటెండెంట్, సెంట్రల్ జైలు, కంది
Kandi01b
Kandi01g