రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆత్మీయన సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడారు. అనంతరం సభాధ్యక్షుడు చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
సదాశివపేట, మార్చి 26: ఉద్యమాలతో సాధించుకున్న తెలంగా ణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మండల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బాలాజీ ఫంక్షన్హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా రు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఏ ర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కోనాపూర్‌కు చెందిన కార్యకర్తలు గజమాలతో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందని, సమ్మేళానికి వచ్చిన విధంగా ఎన్నికల్లో ప్రచారానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కన్నుకుట్టి తెలంగాణలో విపత్తులు చోటు చేసుకున్నా చిల్లిగవ్వ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. మతం ముసుగులో రాష్ర్టానికి నష్టం చేస్తున్న బీజేపీని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు సమష్టిగా పని చేయాలి
గ్రామస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ క్రియాశీల కార్యకర్తలు సమష్టి కృషితో పని చేస్తేనే భారీ మెజార్టీ సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు. రెండు పర్యాయాలు పాలన సాగించిన సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామస్థాయిలో చర్చ జరిగే విధంగా నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు.
డిసెంబర్లో ఎన్నికలు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్న ఎన్నికల సమయం డిసెంబర్లో వస్తుందని, అప్పుడే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఎంతో తెలుస్తుందన్నారు. ప్రజలకు కండ్ల ముందు జరగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకం కలగడంతో మరోసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మ న్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల అంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఆరిఫోద్దీన్, బీఆర్ఎస్ నాయకుడు చింతా సాయినాథ్, ఎంపీపీ తొంటయాదమ్మ, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నవీన్‌కుమార్, ఎంపీటీసీలు అల్లం లలిత, వరలక్ష్మి, సత్యనారాయణ, నరేశ్‌గౌడ్, నాయకులు ఎంఏ హకీం, సుధీర్‌రెడ్డి, సర్పంచ్‌లు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పథకాలు దేశానికే ఆదర్శం..
– బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతాప్రభాకర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అత్యధికంగా నియోజకవర్గంలో అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ సమపాలలో జరుగుతున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కార్యకర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేస్తే మరోసారి విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ దేవుడు…
మాది గొల్లగూడెం. నాకు దళితబంధు పథకంలో జేసీబీ తీసుకున్నా. చింతా ప్రభాకర్ పుణ్యంతో, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయతో దళితబంధు అందించేందుకు మా గ్రామాన్ని ఎంపిక చేశారు. నాకు పథకంలో అందించిన జేసీబీతో ఇప్పుడు పనులు చేస్తూ, మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నా. జీవితాంతం సీఎం కేసీఆర్‌ను దేవుడిగా పూజిస్తా. ఇతర పార్టీల నాయకులు నాకు దళితబంధు రాదని చులకన చేసి మాట్లాడినా చింతా ప్రభాకర్ సార్ నాకు జేసీబీ ఇప్పించారు. ఆయన రుణం తీసుకునేందుకు వచ్చే ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ గెలిచేందుకు ప్రజలను చైతన్యవంతం చేస్తా. – సర్వేశం, గొల్లగూడెం, దళితబంధు లబ్ధిదారుడు