గులాబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ప్రధానంగా పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట నష్టం సంగారెడ్డి జిల్లాలో భారీగా జరిగింది. ఈ జిల్లాలో 17 మండలాల్లో 75,999 మంది రైతులకు చెందిన 1,51,113 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా 1,15,992 ఎకరాల్లో పత్తి , 9,873 ఎకరాల్లో కంది, 15,310 ఎకరాల్లో సోయాబీన్ పంటలు దెబ్బతిన్నాయి. జహీరాబాద్, నారాయణఖేడ్ వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఎక్కువగా పంటనష్టం వాటిల్లింది. మెదక్ జిల్లాలో 1900 ఎకరాల్లో వరి పంట, 250 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో నష్టం అంతగా వాటిల్లలేదు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న సంగారెడ్డి జిల్లాలో పలు రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధ్దరించేందుకు రూ.7.35 కోట్ల నిధులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షంతో జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఎమ్మెల్యేలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో పెరిగిన పంట నష్టం
సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : గులాబ్ తుఫా న్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పంటనష్టం వా టిల్లింది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పం ట నష్టం అంచనాలు సేకరిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు తాజా సమాచారం మేరకు జిల్లాలో 1,51,113 ఎకరాల్లో పంట లు దెబ్బతిన్నాయి. మొత్తం 17 మండలాల్లో 75,999 మంది రై తులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో అత్యధికంగా పత్తి రైతులు నష్టపోయారు. వర్షాల కారణంగా పత్తిపంట నీట మునగడంతో పాటు పత్తికాయలు నల్లబడ్డాయి. దీంతో పత్తి రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది. జిల్లాలో మొత్తం 1,15,992 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. వర్షాలతో జిల్లాలో 9,873 ఎకరాల్లో కంది పంట దెబ్బతిన్నది. కంది పంట నీటమునగడంతో పాటు చాలాచోట్ల పువ్వులు రాలిపోయాయి. 956 ఎకరాల్లో పెసర పంట దెబ్బతినగా, 15,310 ఎకరాల్లో సోయాబీన్ పంటకు నష్టం వాటిల్లింది. 1567 ఎకరాల్లో మినుము, 17 ఎకరాల్లో జొ న్న, 6,746 ఎకరాల్లో మొక్కజొన్న, 64 ఎకరాల్లో చెరుకు పంటలకు నష్టం జరిగింది. వీటితో పాటు 419.2 ఎకరాల్లో ఇతర పం టలు దెబ్బతిన్నాయి. 168 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జహీరాబాద్, నారాయణఖేడ్ వ్యవసాయ డివిజన్ల పరిధిలో పంటనష్టం ఎక్కువ వాటిల్లింది. నారాయణఖేడ్ డివిజన్లోని ఆరు మండలాల్లో 22,041 మంది రైతులకు చెందిన 36,666 ఎకరాల నష్టం జరిగింది. జహీరాబాద్ డివిజన్లోని ఐదు మండలాల్లో 25,522 మంది రైతులకు చెందిన 52,645 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రాయికోడ్ డివిజన్లోని రా యికోడ్, మునిపల్లి, వట్పల్లి మండలాల్లోని 28,775 మంది రైతులకు చెందిన 40వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. సం గారెడ్డి డివిజన్ పరిధిలో 3,811 మంది రైతులకు చెందిన 21,702 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. అందోలు డివిజన్లో 850 మంది రైతులకు చెందిన వంద ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది.
పత్తి రైతుకు తీరని నష్టం..
వర్షాలు పత్తి రైతును చిత్తుచేశాయి. సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట ఎక్కువగా దెబ్బతిన్నది. జిల్లాలో మొత్తం 1,15,992 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. వట్పల్లి మండలంలో అత్యధికంగా 15,164 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో 30,501 ఎకరాల్లో పత్తిపంట దెబ్బతినగా, జహీరాబాద్ డివిజన్లో 25,402 ఎకరాలు, రాయికోడ్ డివిజన్లో 38,953 ఎకరాలు, సంగారెడ్డి డివిజన్లో 21036 ఎకరాలు, అందోలు డివిజన్లో 100 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. పత్తి తర్వాత అత్యధికంగా జిల్లాలో కంది, సోయాబీన్ పంటలకు నష్టం జరిగింది. 9873 ఎకరాల్లో కంది దెబ్బతినగా 15,310 ఎకరాల్లో సోయాబీన్ దెబ్బతింది. జిల్లా వ్యవసాయశాఖ అధికారులు వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తితోపాటు ఇతర పంటల వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.
దెబ్బతిన్న రోడ్లు.. సర్కారుకు ప్రతిపాదనలు
భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని పలు రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గ్రామాలకు దారితీసే రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీరాజ్‌కు చెందిన రోడ్లకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. పంచాతీరాజ్ ఇంజినీరింగ్‌శాఖ అధికారుల వివరాలను అనుసరించి వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధ్దరించేందుకు రూ.7.35 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం ఇంజినీరింగ్ చీఫ్ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ సంగారెడ్డి డివిజన్ పరిధిలో 33 చోట్ల 85.45 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ రోడ్ల మరమ్మతు పనుల కోసం రూ.2.27 కోట్లు నిధులు అవసరం అని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. 22 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుకు రూ.1.30 కోట్లు అవసరం కానున్నాయి. 8.9 కిలోమీటర్ల మేర రహదారుల పక్కన దెబ్బతిన్న సైడ్‌బర్మ్ వేసేందుకు రూ.26.50 లక్షలు అవసరం అవుతాయని అంచనా. అందోలు డివిజన్ పరిధిలో 31 చోట్ల 49.99 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతుకు రూ.2.80 కోట్ల అవసరం అవుతాయని అంచనా. 10 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి వీటి మరమ్మతుకు రూ.35 లక్షలు అవసరం. 45.98 కిలోమీటర్ల మేర రహదారులకు సైడ్‌బర్మ్ వేసేందుకు రూ.30 లక్షలు అవసరం కానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదలను అందజేశారు. ఆర్అండ్బీ రోడ్లు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వీటి సర్వే కొనసాగుతున్నది.