
చేర్యాలలో ఇక ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు
రూ.17కోట్లతో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు
‘ఎల్’ ఆకారంలో గ్రౌండ్‌ఫ్లోర్, రెండంతస్తులు
మున్సిపల్ కార్యాలయం అదే భవనంలోకి..
సేవలు చేరువవుతాయని అంటున్న స్థానిక ప్రజలు
చేర్యాల పట్టణంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రానున్నాయి. పట్టణంలోని జూనియర్ కళాశాల సమీపంలో భవన సమూదాయానికి సర్కారు రూ.17కోట్లు మంజూరు చేయగా, పనులు కొనసాగుతున్నాయి. పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో మంత్రి హరీశ్‌రావు సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ‘ఎల్’ ఆకారంలో నిర్మించే భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్, మొదటి, రెండో అంతస్థులో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
చేర్యాల, ఆగస్టు 29 : చేర్యాల పట్టణంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రానున్నాయి. పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో మంత్రి హరీశ్‌రావు సమీకృత కార్యాలయాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పట్టణంలోని జూనియర్ కళాశాల సమీపంలో భవన సమూదాయానికి సర్కారు రూ.17కోట్లు మంజూరు చేసింది. నిధులు మంజూరు కాగానే మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. సంబంధిత శాఖ అధికారులు నిర్వహించిన టెండర్లలో నిర్మాణ హక్కులు దక్కించుకున్న సంస్థ పనులను ప్రారంభించింది.
సమీకృత భవనంతో ప్రజలకు ఎంతో మేలు..
ప్రభుత్వంలోని ప్రతి శాఖకు చెందిన కార్యాలయం ఇక సమీకృత భవనంలో ఉండనుండడంతో ప్రజలకు ఎంతో మేలు జరుగనున్నది. ఒక్కో కార్యాలయం ఒక్కో ప్రదేశంలో ఉండడంతో ప్రజలు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడడమే కాకుండా ప్రయాసపడేవారు. నిర్మాణ పనులు పూర్తి అయితే వివిధ పనుల కోసం వచ్చే వ్యక్తులు ఒక్కసారిగా భవనంలోకి వెళితే అన్ని పనులు చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోవచ్చు. తాలూకగా చేర్యాల కొనసాగిన సమయంలో నిర్మించిన పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతం థీన స్ధితికి చేరుకున్నాయి. మరిన్ని కార్యాలయాలు ఇరుకుగా ఉండడంతో, మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా నిర్మించే భవనంలో ఓ వైపు ప్రజలకు, మరో వైపు అధికారులు, సిబ్బందికి వసతి కలుగనున్నది. ఎల్ ఆకారంలో నిర్మించే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్, మొదటి, రెండో అంతస్థులో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణ, మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని మినహా అన్ని సమీకృతంలోకే..
కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్ని ఆఫీసులు సమీకృత భవనంలోకి రానున్నాయని సంబంధిత శాఖ అధికారులు తెలుపుతున్నారు. పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ కార్యాలయాలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సమీకృత భవనంలోకి నిర్మాణ పనులు పూర్తికాగానే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని కార్యాలయాలు నెల వారీగా వేలాది రూపాయాల అద్దెలు చెల్లిస్తూ చాలిచాలనీ గదుల్లో పాలన కొనసాగిస్తున్నాయి. కాగా, మున్సిపల్ కార్యాలయం పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో కొనసాగుతుండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎర్పడుతున్నాయి. మున్సిపల్ కార్యాలయాన్ని సైతం ఇంటిగ్రేటెడ్ భవనంలోకి మార్చాలని ఇటీవల చేర్యాలలో జరిగిన అభివృద్ధి పనులు సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిర్ణయించారు. అలాగే భవన నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్‌ను మార్చి మరో గుత్తేదారునికి పనులు అప్పగించాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవన నిర్మాణ పనులు ప్రస్తుతం మొదటి స్లాబ్ పనులు పూర్తి కాగా, మరో పక్కన క్షేత్ర(పిల్లర్స్) స్థాయిలో ఉన్నాయి. సంబంధిత టెండరుదారుడు సకాలంలో పనులు పూర్తి చేస్తే చేర్యాల ప్రజలకు ఎంతో వసతి చేకూరనున్నది.
పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు..
నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. చేర్యాలకు దశల వారీగా అన్ని హంగులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. సమీకృత భవన నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇటీవల డీఈఈ స్థ్ధాయి కార్యాలయాలు సైతం ప్రారంభించారు. సమీకృత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రజలు రుణపడి ఉంటారు.
ప్రజలకు తీరనున్న కష్టాలు..
సమీకృత భవన నిర్మాణంతో పట్టణ, మండల ప్రజల కష్టాలు తీరనున్నాయి. సమీకృత భవనం నిర్మాణం పూర్తి అయ్యిందంటే అధికారులు ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. మండల స్థాయిలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయం నిర్మించడం అభినందనీయం. రూ.17కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కృతజ్ఞతలు.