
కోహెడ, జూన్ 26 : పల్లెప్రగతితో మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం రూపు మార్చుకుంది. అభివృద్ధి పనులకు మారింది. కోహెడ, సముద్రాల, చెంచెల్ చెర్వుపల్లి, మైసంపల్లి, కాచాపూర్ గ్రామాల నుంచి 222 రైతు కుటుంబాలు వచ్చి వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉన్న వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. గ్రామంలో మొత్తం 854 జనాభా ఉండగా.. 784 మంది ఓటర్లు ఉన్నారు. 500లకు పైగా ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. గతంలో సీమాంధ్ర పాలకుల హయాంలో గ్రామం ఎప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండేది. ఒక్క తాగునీటి ట్యాంకు ఉండి అటు తాగునీటి వసతికి ఇటు పారిశుధ్య పనులకు గ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారు. ఎనిమిది వందలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంపై అప్పటి పాలకుల వివక్షో.. ప్రజాప్రతినిధుల సమన్వయ లోపమో.. మొత్తానికి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో గ్రామంలో ఉన్న సమస్యలకు ఒక్కొక్కటిగా పరిష్కారమయ్యాయి. తాగునీటి సమస్యను అధిగమించేందుకు గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మిషన్ భగీరథ కింద ప్రభుత్వం మరో రెండు ట్యాంకులను మంజూరు చేసింది.
దీంతో ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. గ్రామపంచాయతీకి నూతన ట్రాక్టర్‌ను అందజేయడంతో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరిగాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా 24వేల మొక్కలు నాటడంతో ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలతో పాటు గ్రామంలోని ఇతర ప్రదేశాలు అందంగా కన్పిస్తున్నాయి. రూ.2.5లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. రూ. 9లక్షలతో వైకుంఠధామం, షేర్ అలీనగర్‌లో 14, వెంకటేశ్వర్లపల్లిలో 36 లూస్ పోల్స్ వేయడంతో గ్రామమంతటా విద్యుత్ లైట్లు జిగేల్ మంటున్నాయి. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రత్యేక అధికారి నీతు ప్రసాద్ పరిశీలించి ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికచేశారు. సీసీరోడ్ల నిర్మాణానికి రూ.7లక్షలు మంజూరు కాగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. గత సంవత్సరం గణతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ తోట భాగ్యలక్ష్మి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును కూడా అందుకున్నారు. కోహెడ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం.. వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, సీసీరోడ్లు, ఇంటింటికీ ప్రతి రోజు చెత్త సేకరణతో పరిశుభ్రంగా ఉంది.
చాలా సంతోషంగా ఉన్నది..
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం అభివృద్ధి చెందుతున్నది. తాగునీరు, పారిశుధ్య పనులు, విద్యుత్ దీపాల వెలుగులు, హరితహారం కార్యక్రమాలతో గ్రామం పట్టణంలా కనిపిస్తున్నది. పల్లెప్రగతిలో నిధులు నెలనెలా వస్తుండడంతో పాలకవర్గం కూడా అభివృద్ధి పనులు చేపతున్నారు. గత సీమాంధుల హయాంలో ఎన్నడూ గ్రామంలో అభివృద్ధి పనులు జరుగలే. కానీ, టీఆర్స్ ప్రభుత్వ హయాంలో పల్లెప్రగతిలో అభివృద్ధి పనులు చకచకా జరుగుతుండడంతో చాలా సంతోషంగా ఉన్నది.