
ఆసరా పింఛన్‌తో వృద్ధులు, దివ్యాంగులు, వింతువులు, ఒంటరి మహిళలకు భరోసా ఇస్తున్న రాష్ట్ర సర్కారు, మరింత మందికి పింఛన్ ఇచ్చేందుకు నిర్ణయించింది. పింఛన్‌కు అర్హత వయసును 65ఏండ్ల నుంచి 57కు కుదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల జీవో 36ను విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 1,39,750 మంది పింఛన్లు అందుకుంటుండగా, తాజా నిర్ణయంతో మరో 20వేల మంది లబ్ధిపొందనున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 1,04,105 మంది పెన్షన్‌దారులుండగా, మరో 10,982 మంది వృద్ధాప్య పింఛన్‌కు అర్హులవుతారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో 1,73,244మంది పెన్షన్‌దారులుండగా, ఇప్పటికే జిల్లాలో 7500 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్గదర్శకాల ఆధారంగా జిల్లా యంత్రాంగం ఎంపిక చేయనుండగా, మరింత మందికి సామాజిక భద్రత కలగనుంది.
ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు అండగా నిలుస్తున్నది. ఆసరా పింఛన్లతో పేదలకు సామాజిక భద్రత కలుగుతున్నది. ప్రతినెలా మొదటి వారంలో ఆసరా పింఛన్ల డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తున్నది. దీంతో ఎంతోమంది ఆర్థిక అవసరాలు తీరుతున్నాయి. ఎన్నో కుటుంబాలు ఈ డబ్బులు అక్కరకొస్తున్నాయి.
సంగారెడ్డి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ)/మెదక్/సిద్దిపేట : రాష్ట్రంలో ఆసరా పథకం కింద పింఛన్లు అందజేస్తూ ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తున్నది. వృద్ధ, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరియా బాధితులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2016 పింఛన్ అందజేస్తున్నది. దివ్యాంగులకు ప్రతినెలా రూ.3016 పింఛన్ ఇస్తున్నది. 65 ఏండ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ వర్తిస్తున్నది. ఈ నిబంధనలను తొలిగించి తమకు పింఛన్ వర్తింపజేయాలని 57 ఏండ్లు దాటిన వారు సీఎం కేసీఆర్‌ను అనేక మార్లు కోరారు. 57 ఏండ్లు దాటిన వారికి పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు కుదిస్తూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల జీవో 36ను విడుదల చేసింది. ఈ జీవోను అనుసరించి 57 ఏండ్లు నిండిన వారు త్వరలో ఆసరా పింఛన్లు అందుకోనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో 20వేల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ప్రతినెలా 1,39,750 మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. ఇందులో 48,186 మంది వృద్ధ్దాప్య పింఛన్లు అందుకుంటున్నారు. 15,280 మంది దివ్యాంగులు, 66,855 మంది వితంతులు, 757 మంది చేనేత కార్మికులు, 814 మంది కల్లుగీత కార్మికులు, 7369 మంది ఒంటరి మహిళలు, 94 మంది బీడీకార్మికులు, 395 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు పింఛన్లు పొందుతున్నారు. వీరందిరికీ ప్రభుత్వం ప్రతినెలా రూ.31.29 కోట్లు ఖర్చు చేస్తున్నది. తాజాగా పింఛన్ పొందేందుకు వయస్సును కుదించడంతో జిల్లాలో మరో 20వేల మంది లబ్ధిపొందనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వారిని ఇది వరకే గుర్తించారు. ఓటరు జాబితా, ఆధార్ కార్డుల ఆధారంగా వయస్సును నిర్ధారించారు.
ప్రస్తుతం మెదక్ జిల్లాలో వృద్ధాప్య 31,034, దివ్యాంగుల 8,764, వితంతు 44,070, చేనేత 509, గీత కార్మిక 867, ఒంటరి మహిళలు 4,214, బీడీకార్మికులు 14,163, ఫైలేరియా 484 మంది పింఛన్‌దారులు ఉన్నారు. మొత్తంగా 1,04,105 మంది పింఛన్ పొందుతున్నారు. వీరికి ప్రతినెలా ప్రభుత్వం రూ.23.12 కోట్లు ఖర్చు చేస్తున్నది. పింఛన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించడంతో జిల్లాలో మరో 10,982 మంది వృద్ధాప్య పింఛన్‌కు అర్హులవుతారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే వీరి జాబితా ఆన్లైన్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఒక ఇంట్లో ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలన్న నిబంధనను అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జాబితాను మరోసారి పరిశీలిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య 52,421, వితంతు 53,212, దివ్యాంగులు 14,777, చేనేత 2,374, గీత కార్మిక 2971, బీడీ కార్మిక 44,086, ఒంటరి మహిళలు 3,395 పింఛన్‌దారులు ఉన్నా రు. మొత్తంగా అన్ని పింఛన్లు కలిపి 1,73,244 ఉన్నాయి. నెలనెలా ఈ పింఛన్లకు ప్రభుత్వం రూ.37.67 కోట్లు ఖర్చు చేస్తున్నది. కాగా, పింఛన్ అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించడంతో మరింత మందికి అందనున్నది. ఇప్పటికే జిల్లాలో 7500 దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడగానే మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ అనుమతి రాగానే అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీఆర్డీవో గోపాల్‌రావు తెలిపారు.
పింఛన్ మొత్తాలను పెంచుతామని టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో హామీనిచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మేరకు వృద్ధాప్య, వితంతు పింఛన్‌ను రూ.200 నుంచి రూ.1000, దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.1500లకు పెంచుతున్నట్టు అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండోసారి ఎన్నికల సమయంలో కూడా మరోసారి పింఛన్లు పెంచుతామని డిసెంబర్ 2018 ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధ, వితంతువుల పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016, దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించి అమలు చేశారు. ఇప్పుడు పింఛన్‌కు వయోపరిమితిని తగ్గించడంతో మరింత మందికి పింఛన్ అందనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ల వయసు 57 ఏండ్లకు సడలిస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. దీంతో పింఛన్లు పొందేందుకు 57 నుంచి ఉన్నవారు అర్హులవుతారు. జిల్లాలో ఇది వరకే 65 ఏండ్లు దాటిన వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాం. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదు. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
మెదక్ జిల్లాలో 57 ఏండ్లు నిండిన వారు 10,982 మందిని ప్రాథమికంగా గుర్తించాం. వీరందరికీ నిబంధనల ప్రకారం పింఛన్లు వస్తాయి. ఇప్పటి వరకు ఆసరా పథకం కింద 65 ఏండ్లు పైబడిన వారికే ప్రభుత్వం పింఛన్ ఇస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు పింఛన్లు అందిస్తాం.