
సంగారెడ్డి, జూలై 1 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. తొలిరోజు జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించారు. గ్రామసభల్లో ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, కలెక్టర్ హనుంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రామసభల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు మాట్లాడుతూ.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలు, అధికారులకు పిలుపునిచ్చారు. రాబోయే పదిరోజుల పాటు పల్లె ప్రగతిలో చేపట్టే కార్యక్రమాలతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో ఫరిడవిల్లాలని ఆకాంక్షించారు. గ్రామసభల్లో పాల్గొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం విజయవంతం చేయాలని కోరారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని భానూరు గ్రామంలో ప్రారంభించి గ్రామసభలో ప్రసంగించారు.
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పటాన్చెరులో పట్టణ ప్రగతి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రత్యేక పారిశుధ్య వాహన సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ, జడ్పీటీసీ సుప్రజా వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ మండలంలోని చెరాగ్‌పల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య పాల్గొని పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. జహీరాబాద్ మున్సిపల్లోని 14 వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఆర్డీవో రమేశ్‌బాబు పాల్గొని మొక్కలు నాటారు. న్యాల్కల్ మండలంలోని హుసెల్లిలో నిర్వహించిన పల్లె ప్రగతిలో డీఎల్పీవో రాఘవరావు పాల్గొన్నారు. కోహీర్ మండలంలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో డీఆర్డీవో ఆడిషనల్ పీడీ సూర్యారావు పాల్గొన్నారు.
ఝరాసంగం మండలంలో ఈజీఎస్ ఏపీడీ జయదేవులు, మొగుడంపల్లి మండలంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీడీవో రాములు పాల్గొన్నారు. నారాయణఖేడ్ మండలం మాద్వార్ తండాలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. మనూరు మండలం మాయికోడ్, బోరంచ గ్రామాల్లో డీఆర్డీవో శ్రీనివాస్, కంగ్టి మండలం తడ్కల్‌లో డీఎల్పీవో సురేందర్ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రుబీనాబేగం నజీబ్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి పనులను ప్రారంభించి జేసీబీ సాయంతో ముండ్ల పొదలను తొలగించడంతో పాటు మురుగు కాల్వలను శుభ్రం చేశారు.
హరితహారంలో భాగంగా రాయిపల్లి రోడ్డు ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా మునిపల్లి మండలం బుధేరాలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అందోల్, వట్పల్లి, పుల్కల్, రాయికోడ్, చౌటాకూర్, హత్నూర మండల్లాలో మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్ని పల్లెప్రగతి విజయవంతంపై చర్చించారు.
ప్రజల భాగస్వామ్యంతోనేఅభివృద్ధి : సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
పల్లె, పట్టణ ప్రగతి, హారితహారం కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రజల భాగస్వామ్యంతోనే రూపురేఖలు మారుతాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా కంది మండలం మామిడిపల్లిలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెప్రగతి, హరితహారం నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్‌మోహన్, మండల ప్రత్యేకాధికారి, డీఈవో రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షిషా మునిపల్లి మండలం బుధేరాలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్ని ప్రసంగించారు. గ్రామ ప్రజలు హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి వార్డు సభలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రామసభల నిర్వహణ మెదక్, జూలై 1 : మెదక్ జిల్లాలో ఏడో విడత హరితహారం, నాలుగో విడత పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదటి రోజు గురువారం ప్రతి గ్రామ పంచాయతీల్లో ఉదయం 9 గంటలకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో ప్రగతి నివేదికను పంచాయతీ కార్యదర్శులు చదివి వినిపించారు. గ్రామాల్లో ఉన్న ప్రాధాన్యత క్రమంలో కార్యక్రమాలను గ్రామ సభ ముందు ఉంచి సభ ఆమోదం పొందారు. అనంతరం పల్లెల్లో వీధులను శుభ్రం చేశారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు గ్రామసభలు నిర్వహించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్‌లో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించి మొక్కలు నాటారు. మనోహరాబాద్, తూప్రాన్ మండలం నాగులపల్లిలో జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్‌గౌడ్, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని మొక్కలు నాటారు. చేగుంట మండలం చిన్నశివనూర్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ పర్యటించారు.