Rajiv Yuva Vikasam | మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ యువ వికాసం పథకంలోఎంపికైన లక్ష రూపాయలలోపు లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరీ ప్రతాలు అందజేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం మంజూరీపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో చేపట్టిన ఇండ్లను అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని అన్నారు. మంజూరైన మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత ఎంపికలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రజా ప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూ ఎంపిక చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాల్సిందిగా పలు సూచనలు చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖచే ఆమోదం పొందిన ఇందిరమ్మ మంజూరు పత్రాలను నిబంధనలు మేరకు అతి త్వరలో పంపిణీ చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.
రాజీవ్ యువ వికాసం పథకంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. యువ వికాసం లబ్ధిదారుల ఎంపికైన రాజీవ్ యువ వికాసం లక్ష రూపాయలలోపు లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరీ ప్రతాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. దానికి ప్రభుత్వ నిబంధనల మేరకు కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.