సదాశివపేట, జూలై 17: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. వర్షం, వరద సాఫీగా వెళ్లడానికి నిర్మించిన కాల్వలు, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో సమస్య జఠిలంగా మారింది. మున్సిపాలిటీలో 26 వార్డులతో పాటు ప్రధాన రహదారి వెంట డ్రైనేజీలు నిర్మించిన తీరు చూస్తే ఆయా ప్రాంతవాసులు ఆగ్రహించే పరిస్థితి నెలకొన్నది. చత్రపతి శివాజీ విగ్రహం నుంచి సిద్దాపూర్ గౌని వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడిక పేరుకుపోయింది. బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోయి కంపు కొడుతున్నది. జ్యోతి థియేటర్ ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ చెత్తా చెదారంతో పూడుకుపోతున్నది. చౌకిమఠం పక్క నుంచి మార్కండేయ ఆలయం వరకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీలో మురుగు పేరుకుపోయింది. దీంతో ఆ పరిసరాలు దుర్గంధంగా మారాయి. రాఘవేంద్రనగర్ కాలనీ, రహమత్‌నగర్, ఫయాజ్‌నగర్, హనుమాన్‌నగర్, హరిజనవాడ, సిద్దాపూర్ కాలనీ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో పూడిక, వ్యర్థ పదార్థాలు పేరుకుపోయాయి. పట్టణంలో కందకం రోడ్డు చుట్టూ ఉన్న డ్రైనేజీలు మురుగుతో నిండిపోతున్నాయి.
సదాశివపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడంతో మురుగుతో ప్రజ లు సీజనల్ వ్యాధుల బారినపడే ప్ర మాదం ఉంది. ఇండ్ల మధ్య మురుగు, కుంటలు ఏర్పడడం, కొత్త కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, విధిగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం, చెత్త తరలించక పోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమకాటుతో ప్రజలు మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాల బారిన పడే అవకాశం ఉన్నదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో పలు కాలనీల్లో డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో రోడ్లపైనే వర్ష్షపు నీరు నిలుస్తోంది. సదాశివపేట మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. 105 మంది ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు, 21 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. 2చెత్త సేకరించే ట్రాక్టర్లు , 10 చెత్త సేకరించే ఆటోలు బల్దియాలో ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో మురుగు, వర్షం నీటిని మళ్లించడానికి తప్పనిసరిగా కల్వర్టులు నిర్మించాల్సి ఉన్నా ఎక్కడికక్కడ మురుగు కాల్వలు మూసివేశారు. చాలా కాలనీల్లో కల్వర్టులు, డ్రైనేజీలు పూర్తిగా మూసుకుపోయాయి. గతంలో నిర్మించిన వరద కాల్వలు ఎందుకు పనికిరాకుండా మారా యి. అది అధికారుల అవగాహన రాహిత్యానికి ఇదో నిదర్శనంగా కనిపిస్తున్నది. కాలనీల్లో చేప ట్టే డ్రైనేజీలు లోప భూయిష్టంగా మారడంతో మురుగు ముందుకు పారడంలేదు. డ్రైనేజీలోనే వ్యర్థా లు, మురుగునీరు నిల్వ ఉంటుంది.
పట్టణంలోని చాలా కాలనీలు దుర్గంధంతో నిండిపోయాయి. రాఘవేంద్రనగర్, రహమత్‌నగర్, ఫయాజ్‌నగర్, హరిజనవాడ, సిద్దాపూర్ కాలనీ, హనుమాన్‌నగర్ తదితర కాలనీల్లో నివాసాల మధ్య మురుగు పేరుకుపోయి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నా సమస్యలు మాత్రం అలాగే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పం దించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
సదాశివపేట మున్సిపాలిటీలోని ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న మురుగు, వరద నీటి కాల్వల నిర్మాణ సమయంలో అధికారులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించలేదు. దీంతో అందులో మురుగు వెళ్లకుండా నిల్వ ఉండే పరిస్థితి ఏర్పడింది. గతంలో జ్యోతి థియేటర్ ఎదురుగా బైపాస్ రోడ్డు వద్ద నిర్మించిన డ్రైనేజీ, కల్వర్టు నిర్మాణాలు ప్రస్తుతం చిన్నపాటి వర్షానికే తట్టుకోలేకపోతున్నాయి. సిద్దాపూర్ గౌని వద్ద డ్రైనేజీ పరిస్థితి అంతే. వర్షం నీరు కొంత చేరినా డ్రైనేజీలో మురుగు రోడ్డుపైకి చేరుతున్నది. వాహనదారులు, స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీనికి తోడు ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న మురుగు, వరద నీటి కాల్వలు వెడల్పుగా నిర్మించకపోవడం, పైగా అందులోకి వర్షం నీరు వెళ్లకపోవడంతో కొత్త సమస్య పట్టణవాసులకు ఎదురవుతుంది. ఈ సమస్యలన్నింటికీ గతంలో అవగాహన రాహిత్యంతో ప్రణాళిక లేకుండా నిర్మించిన రోడ్లు, డ్రైనేజీలేనని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో ఆయా వార్డుల్లోని అంతర్గత ప్రాంతా ల్లో డ్రైనేజీ సమస్యలు వేధిస్తున్నాయి.