సిద్దిపేట,జనవరి 4: రైతు సమస్యల పరిష్కారం, డిమాండ్లు నెరవేర్చడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదని, బీజేపీ సర్కారు రైతు వ్యతిరేఖ విధానాలకు వీడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మారెడ్డి రామలింగా రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ధర్నాకు కేంద్రం స్పందించక పోవడం దారుణమన్నారు.
ప్రముఖ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లే 70ఏండ్ల వయస్సులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపైన నిరసన చేపట్టినట్లు తెలిపారు. రైతులు పండించిన పంటలకు న్యాయమైన ఎమ్మెస్పీ నిర్ణయించాలని, ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధ్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. జగ్జిత్ సింగ్ చేపట్టిన నిరాహార దీక్ష 41వ రోజుకు చేరిందన్నారు.
ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని తెలంగాణ రైతుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించాలని రైతు నాయకులు కోరారు.కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మయ్య, యాదం రావు, దేవేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, మోహన్ రెడ్డి, పి వెంకట్ రెడ్డి, భూపతిరెడ్డి, సంతోష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.