నారాయణఖేడ్, జూన్ 19: స్థానిక ఎన్నికల వేళ మరోసారి రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా తెరమీదికి తెచ్చిందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల రైతుబంధుకు బదులు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామని అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 వేలకు తగ్గించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే గత రెండు పంటల రైతుభరోసాతో కలిపి మొత్తం మూడు పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి రైతులను నిండాముంచిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పి చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గత ఖరీఫ్‌కు మాత్రమే బోనస్ ఇచ్చిందని, యాసంగి పంట బోనస్ ఇవ్వలేదని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇష్టారీతిన దోపిడీ జరిగిందని, క్వింటాల్ ధాన్యానికి 5 నుంచి 10 కిలోల తరుగు, క్వింటాల్ జొన్నలకు ఐదు కిలోల చొప్పున తరుగు విధించి రైతులను నష్టపర్చడమే కాకుండా పొరుగు రాష్ర్టాల జొన్నలను కొనుగోలు చేసి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా 70 శాతం మందికి చేయకుండానే అసంపూర్తిగా ముగించారన్నారు.
వ్యవసాయ ఉపకరణాలు, విత్తనాలకు సబ్సిడీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిరాశకు గురి చేసిందన్నారు. కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామని, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా మలచుకుని రైతులు అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ఎం.ఏ.నజీబ్, ఆహీర్ పరశురామ్, నాగేందర్ పాటిల్, ముజామిల్, వెంకటేశం, విఠల్‌రావు, సాల్మ న్, రాజునాయక్, వెంకట్‌నాయక్ పాల్గొన్నారు.