హుస్నాబాద్, సెప్టెంబర్ 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ కమ్ ఫంక్షన్‌హాల్ భవనం నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు సంబంధిత మార్కెటింగ్ అధికారులు దీనిని ఉపయోగంలోకి తీసుకురావడం లేదు. హుస్నాబాద్ పట్టణ వాసులకు కూరగాయల మార్కెట్‌ను అందుబాటులో ఉంచేందుకు అన్ని వసతులతో భవనాన్ని నిర్మించారు. మార్కెటింగ్‌శాఖ నుంచి రూ.3కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో రైతుబజార్ నిర్వహణ, మొదటి, రెండో అంతస్తులో ఫంక్షన్‌హాల్ నిర్వహించుకునేలా భవనాన్ని నిర్మించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు భవనాన్ని ఉపయోగంలోకి తేవపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రూ.3కోట్లతో నిర్మించిన భవనాన్ని వృథాగా వదిలేయడం ఏమిటని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు. రైతులు పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ భవనాన్ని రైతులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు తెస్తున్న కూరగాయలు అమ్ముకోవడానికి సరైన వసతి లేక పట్టణంలోని ఎల్లంబజార్, మెయిన్‌రోడ్డు, మల్లెచెట్టు చౌరస్తాల్లో కూరగాయలు విక్రయిస్తున్నారు. రోడ్డ్డుకు ఇరువైపులా కూరగాయల దుకాణాలు ఉండటం వల్ల వాహనదారులు, పట్టణ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రైతులు కూడా దుకాణాదారులతో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ వాసులు కూడా రోడ్లపైనే కూరగాయలు కొనుగోలు చేసేందుకు నానా తిప్పలు పడాల్సివస్తోంది. రైతుబజార్ ప్రారంభమైనైట్లెతే తమకు కూరగాయలు అమ్ముకునేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని, అధికారులు స్పందించి రైతుబజార్ భవనాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
రూ.3కోట్ల ప్రజాధనంతో నిర్మించిన రైతు బజార్ భవనాన్ని నిరుపయోగంగా ఉంచడం సరికాదు. మార్కెటింగ్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూరగాయలు పండించే రైతులు, కొనుగోలు చేసే ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణం మధ్యలో నిర్మించిన ఈ భవనం ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చిన్నచిన్న శుభకార్యాలు చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఈ భవనాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి.
-కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జి, హుస్నాబాద్
రైతు బజార్ భవనానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు నిధులు కూడా మంజూరయ్యాయి. సంబంధిత ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి భవనంలో విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం. రైతు బజార్కోసం నిర్మించిన గదులతో పాటు మొదటి అంతస్తులో నిర్మించిన ఫంక్షన్‌హాల్‌కు కూడా త్వరలోనే బహిరంగ వేలం నిర్వహిస్తాం. రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.
-వెంకటయ్య, మార్కెట్ కార్యదర్శి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా