సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పటాన్చెరు/ అమీన్పూర్, డిసెంబర్ 14: ఒక చారిత్రక తప్పిదం.. ఒక విలీనం.. 60 ఏండ్ల గోసకు కారణమైంది. కొట్లాడి తెచ్చుకుంటే స్వేచ్ఛావాయువులు లభించాయి. ఇప్పుడు గ్రేటర్లో మరో విలీనం కలకలం రేపుతున్నది. మరో విప్లవానికి శ్రీకారం చుడుతున్నది. కత్తి పక్కోడిది అయినా పొడిచేది మనోడే అన్నట్టు.. కాంగ్రెస్ సర్కారు పల్లెవాసులపై కత్తికట్టింది. భారీ కుట్రలకు తెరలేపింది. సాధారణ పల్లెవాసులు ఈ విలీనం వద్దే వద్దు.. మా గ్రామమే మాకు ముద్దు అని మొత్తుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరించి ఉన్న ఔటర్ రింగు రోడ్డు పరిధిలో 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అక్కడితో ఆగకుండా పక్కావ్యూహంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రణాళికలను గుట్టుచప్పుడు కాకుం డా అమలు చేస్తున్నది. ప్రభుత్వ మొండి వైఖరిపై పల్లెల్లో మరో ఉద్యమం ఊపందుకుంటున్నది. సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరో విప్లవాన్ని సృష్టిస్తామని విలీన గ్రామల ప్రజలు హెచ్చరిస్తున్నారు.
గ్రామాల విలీనానికి లైన్ క్లియర్
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయడం అనివార్యంగా మారింది. విలీనంపై కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతంలో విలీన ప్రక్రియను చేపడుతూ విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పలు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారమే విలీన ప్రక్రియ సాగుతుందన్న ప్రభుత్వ వాదనలకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో విలీనంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో… విలీన ప్రక్రియ అనివార్యంగా మారింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు కోర్టును ఆశ్రయించినా… పిటిషన్లను సీజే ధర్మాసనం కొట్టి వేయడంతో విలీన ప్రక్రియపై ప్రభుత్వం మరింత దూకుడు పెంచనున్నది.
రచ్చబండల వద్ద చర్చ
రేవంత్ ప్రభుత్వం తీసుకున్న 51 గ్రామాల విలీన ప్రక్రియ పెద్దఎత్తున విమర్శలకు తావిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్ జిల్లాలో 28, సంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలు 13 మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. గ్రామాలను విలీనం చేసే విషయంలో గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా 2నెలల వ్యవధిలోనే ఒక సంస్థ అభిప్రాయం, అధికారులతో కమిటీ వేసి, ఆ తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వారి అభిప్రాయం ద్వారానే విలీన ప్రక్రియ హడావిడిగా చేశారనే విమర్శలు ఉన్నాయి.విలీనమైతే భూముల ధర పెరగడం మాటేమోకానీ, విలీన గ్రామాలను హైడ్రా పరిధిలోకి తీసుకురావడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతున్నది. పన్నుల భారం, కోల్పోనున్న పచ్చదనం, అధికారులను కలిసే అవకాశమేలేని పాలనా అసౌకర్యం, రాజకీయ నిరుద్యోగం, పర్మిషన్లు కావాలన్నా.. ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా తప్పని ఆర్థికభారం.. ఇవన్నీ ప్రస్తుతం రచ్చబండల వద్ద చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పల్లెకోసం కదం తొక్కుతున్నారు. గ్రామ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను సిద్ధంచేసుకుంటున్నారు.
అంతా హడావిడే..
గ్రేటర్ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించే ప్రణాళికతో మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను విలీనం చేయాలని సర్కారు సంకల్పించింది. అస్కీకి విలీన ప్రక్రియపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజ్గిరి కలెక్టర్లతో మరో కమిటీ వేసింది. ఈ రెండు కమిటీలు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయొచ్చని సూచించింది. ఆగస్టు 1న క్యాబినెట్ సబ్‌కమిటీ వేయగా ఆగస్ట్ 22న వారు నివేదిక ఇస్తూ 45 గ్రామాలకు మరో 6 గ్రామాలు కలుపాలని సూచించింది. మున్సిపల్ చట్టం 2019కి సవరణలు చేస్తూ, సెప్టెంబర్ 3న 51గ్రామాల విలీనానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్‌తో ఆమోదముద్ర వేయించారు. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే హడావిడిగా ఈ ప్రక్రియ చేపట్టడంపై మెజార్టీ గ్రామాల్లో వ్యతిరేకత పెల్లుబికుతున్నది. ఈ విలీన ప్రక్రియ వెనుక పూర్తిగా కుట్రకోణం దాగి ఉందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై శంషాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ధర్నాలు చేశారు. తమకు తెలియకుండానే గ్రామపంచాయతీ కార్యదర్శి విలీనంపై దొంగ సంతకాలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇక కొన్ని గ్రామాలు విలీనమే వద్దని ఏకగ్రీవంగా తీర్మానాలూ చేస్తున్నాయి.
మా గ్రామాల కోసం కొట్లాడుతాం
గ్రామ పంచాయతీ ఉంటే ప్రజలకు పాలన చేరువగా ఉంటుంది. మున్సిపాటీలు, జీహెచ్ఎంసీలో గ్రామాలను కలిపితే సామాన్య ప్రజలకు పాలన దూరం అవుతుంది. పన్నులు పెరిగి పేదలపై భారం పడుతుంది. ఉపాధి హామీ పనులు బంద్ అవుతయి. పేద, మధ్య తరగతికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే మా గ్రామాల కోసం కొట్లాడుతాం. ఐక్య కార్యచరణను సిద్ధం చేసుకుంటాం.
– చారి, కిష్టారెడ్డిపేట, సంగారెడ్డి జిల్లా
ప్రజాభిప్రాయం లేదు
తెల్లాపూర్ మున్సిపాలిటీలో అధికారులు ముత్తంగి గ్రామాన్ని బలవంతంగా కలిపారు. ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. ప్రజలందరూ ఒప్పుకున్నారని అధికారులే రాసుకుని విలీనం చేశారు. రేపు తెల్లాపూర్ మున్సిపాలిటీని జీహెచ్ఎంసీలో కలుపుతారంట. అప్పుడు ప్రజలకు ట్యాక్స్‌ల భారం పెరుగుతుంది. పేదలు, మధ్య తరగతివారు జీవించడం కష్టతరంగా మారుతుంది.
– అనిల్‌కుమార్, ముత్తంగి, సంగారెడ్డి జిల్లా
సామాన్యులకు పన్నుల మోత
మా గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మా గ్రామం ఇంకా పల్లె వాతావరణంలోనే ఉంది. గ్రామాన్ని అభివృద్ధి చేసిన తరువాత మున్సిపాలిటీలో కలిపితే బాగుండేది. పన్నుల మోత సామాన్యులకు భారంగా మారనునున్నది. ప్రజల ఇష్టం లేకుండా ప్రభుత్వం బలవంతంగా విలీనం చేయడం తగదు.
– పెంటేశ్గౌడ్, దాయర గ్రామం, సంగారెడ్డి జిల్లా