సంగారెడ్డి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ) : జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం ఉదయం నుంచి కార్మికులు సమ్మె ప్రారంభించారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ఆర్టీసీ డిపోల్లోని కార్మికులంతా విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. సమ్మెతో ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి.
సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల్లో ఒక్క బస్సు నడవలేదు. పోలీసుల అత్యుత్సాహంతో సంగారెడ్డి డిపో వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రైవేటు డ్రైవర్ ద్వారా సంగారెడ్డి డిపో నుంచి రెండు బస్సులను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఆ బస్సులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
ప్రభుత్వ కార్యాలయాలపైనా ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ పడిం ది. సంగారెడ్డి కలెక్టరేట్లోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి నుంచి బస్సుల్లో సంగారెడ్డికి వస్తారు. బస్సులు లేక తక్కువ సంఖ్యలో విధులకు హాజరయ్యారు. దీంతో కలెక్టరేట్లో సిబ్బంది లేకుండా బోసి పోయింది.
ఆర్టీసీ సమ్మెతో డిపోల నుంచి బస్సులు కదల్లేదు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల్లో మొత్తం 240 బస్సులు ఉన్నాయి. మూడు డిపోల పరిధిలో 1000 వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. జేఏసీ పిలుపు మేరకు మూడు డిపోల పరిధిలోని కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 6గంటల నుంచే బస్సు డిపోల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో డిపోల నుంచి ఒక్క బస్సు బయటకు రాలేదు. ప్రైవేటు డ్రైవర్ల ద్వారా పోలీసులు భద్రతతో బస్సులు నడిపేందుకు ప్రయత్నించగా, కార్మికులు అడ్డుకున్నారు.
సంగారెడ్డిలో డిపోలోని 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 6గంటల నుంచి కార్మికులు బస్టాండు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. కార్మికులు సీఎం డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మధ్యాహ్నం పోలీసుల భద్రత మధ్య రెండు బస్సులు నడిపేందుకు అధికారులు ప్రయత్నించారు. సంగారెడ్డి బస్టాండు ఎ దుట ఆర్టీసీ కార్మికులు బస్సులు బయటకు రాకుం డా అడ్డుకున్నారు. బస్సుల ముందు మహిళా కండక్టర్లు, కార్మికులు బైఠాయించారు.
కిశోర్ అనే కండక్టర్‌పై పోలీసులు చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో కార్మికులంతా పోలీసులతో గొడవ కు దిగారు. మహిళా కండక్టర్లను పోలీసులు ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు పోలీసు అధికారులు బస్సులను డిపోలకు పంపటంతో గొడవ సద్దుమణిగింది. సమ్మెలో జేఏసీ కన్వీనర్ కృష్ణారెడ్డి, నాయకులు పీకే మూర్తి, అప్సర్ అలీ, రవి, పీరయ్య పాల్గొన్నారు.
కార్మికులు సమ్మెతో ఆర్టీసీకి తొలిరోజు రూ.45 లక్షల ఆదాయానికి గండి పడింది. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోలున్నాయి. మూడు డిపోల పరిధిలో 240 బస్సులు ఉన్నాయి. ఈ డిపోల నుంచి వేర్వేరు రూట్లలో బస్సులు నడుస్తుంటా యి. దీంతో రోజుకు ఆర్టీసీకి రూ.45 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది.
గురువారం నుంచి బస్సులు నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేస్తుంది. అనుభవం ఉన్న డ్రైవర్లను, పదోతరగతి ఉత్తీర్ణులైన వారిని కండక్టర్లను జిల్లా రవాణాశాఖ ద్వారా తీసుకుని గురువారం నుంచి బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నది. సమ్మెలో పాల్గొంటు న్న కార్మికులు శాంతియుతంగా వ్యవహరించాలని ఆర్టీ సీ ఆస్తులకు, బస్సులను ధ్వంసం చేసే ప్రయత్నం చే యవద్దని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఉదయ భాస్కర్ కో రారు. గురువారం నుంచి మహాలక్ష్మీ బస్సులు నడిపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.