టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టనుండగా, ఆమోదం పొందగానే ఆర్టీసీ ఉద్యోగులంతా సర్కారు ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్ రీజియన్‌లో మొత్తం 2,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 1100 మంది కండక్టర్లు, 750 మంది డ్రైవర్లు, 750 మంది వివిధ క్యాడర్లలో విధుల నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సిబ్బంది, కార్మికులతో పాటు వివిధ యూనియన్ల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఒకరికొకరు ఫోన్లు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఎన్నో ఏండ్ల కల నెరవేరబోతున్నదని సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెబుతున్నారు. మంగళవారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
– సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 31
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 31: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇకపై ప్రభుత్వ శాఖగా మారనున్నది. సంస్థ ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరనున్నది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బిల్లు ఆమోదం పొందగానే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో పట్టలేని సంతోషం నెలకొన్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆనందంతో స్వాగతిస్తున్నారు. సోమవారం సాయంత్రం వర్షం కారణంగా ఇండ్లకే పరిమితమైన ఆర్టీసీ ఉద్యోగులు ఒకరికొకరు ఫోన్లు చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇకపై మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవం దక్కనున్నదని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేయడం గొప్ప విషయమని పేర్కొంటున్నారు. ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందని, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని ఉద్యోగులు పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్ రీజియన్‌లో మొత్తం 2,600 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో 1100 మంది కండక్టర్లు, 750 మంది డ్రైవర్లు ఉండగా, 750 మంది వివిధ క్యాడర్లలో పని చేస్తున్నారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇదిలాఉండగా మెదక్ రీజియన్‌లో 8 డిపోలు, 587 బస్సులు ఉన్నాయి. మెదక్ డిపోలో 99 బస్సులు ఉండగా, సిద్దిపేట డిపోలో 107 బస్సులు, సంగారెడ్డిలో 94, జహీరాబాద్ 92, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 70, నారాయణఖేడ్ 60, దుబ్బాక 35, నర్సాపూర్ డిపోలో 30 బస్సులున్నాయి. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో విలీనమైన హుస్నాబాద్ డిపో కరీంనగర్ రీజియన్‌లో ఉన్నది. ఇక్కడ మొత్తం 51 బస్సులు ఉండగా, 215 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఎస్ఆర్టీసీ ముందు వరుసలో నిలిచింది. నాటి తెలంగాణ ఉద్యమనేత, నేటి సీఎం కేసీఆర్ ఎప్పుడు పిలుపునిచ్చినా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు పోరాటంలో కలిసివచ్చారు. ఉద్యమంలో భాగంగా ప్రగతి రథ చక్రాలు ఆగిపోవడంతో ప్రజా రవాణ స్థంభించింది. ఎక్కడి బస్సులు అక్కడ నిలిపివేసి రోడ్డుపైనే వంటావార్పు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. సకలజనుల సమ్మెలోనూ టీఎస్ఆర్టీసీ పాత్ర కీలకం. ఇలా చెబుతూపోతే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషి ఫలితం, గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ యూనియన్లు, ఉద్యోగులు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయించారు.
పటాన్చెరు, జూలై 31: మియాపూర్ నుంచి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగించడంతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కుర్ర సత్యనారాయణను ఎంపిక చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పటాన్చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి మెట్రో రైలును ఇస్నాపూర్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం, తొలి కేబినెట్ సమావేశంలోనే విస్తరణకు ఆమోదం తెలుపుతానని ప్రకటించారన్నారు. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనే మెట్రో పొడిగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మెట్రోకు సహకరించిన మంత్రు లు కేటీఆర్, హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డిలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను గుర్తించి తీసుకున్న ప్రభుత్వ నిర్ణయం సంతోషకరం. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. తమకు గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటాం. శాసనసభ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టి తమను ఉద్యోగులుగా మార్చడం రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. అదేవిధంగా రద్దు చేసిన యూనియన్లను కూడా ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 31: తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఏర్పడగానే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఒకశాతం ఎక్కువగానే పిట్మెంట్ సీఎం కేసీఆర్ ఇచ్చారు. మరో దఫాగా తెలంగాణ రాష్ట్ర కార్మికలోకానికి అనుగుణంగా వారి కలను సాకారం చేస్తూ..తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న మహోత్తముడు కేసీఆర్‌కు కార్మికుల పక్షాన ప్రత్యేక దన్యవాదాలు. సీఎం కేసీఆర్ ఏదిచేసినా దూరదృష్టితో ఆలోచించి చేస్తారే తప్పా చెడు చేయరు. 2019లో 55 రోజుల సమ్మె చేసినందుకు గానూ ప్రగతిభవన్‌కు ఆర్టీసీ కార్మికులను పిలుచుకొని హామీఇచ్చారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే సత్తా దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఉందని కొనియాడారు. కేసీఆర్ కలలుగన్న బంగారుతెలంగాణ కోసం ఆర్టీసీ కార్మికులం ఎల్ల్లావేళాల కృషి చేస్తాం. ప్రభుత్వంలో ఆర్టీసీ వీలినంచేయడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలకు కలుగకుండా అన్ని విధాలా సౌకర్యాలు కల్పించి సురక్షితంగా ప్రయాణించేలా ముందుకెళ్తాం. ఇలాంటి ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్నా. ఆర్టీసీ కార్మికుల బాగుకోసం విశేషంగా కృషి చేసిన మంత్రి హారీష్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఎంఆర్‌కె రావు. టీఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. కేసీఆర్‌కు, ప్రభుత్వానికి కార్మికులంతా జీవితాంతం రుణపడి ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. కార్మికులపై ప్రేమ ఉన్న ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టం. ఆయనే కలకాలం సీఎంగా ఉండాలి.
– పీఎస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర నాయకుడు
నర్సాపూర్, జూలై 31: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించడం ఆర్టీసీ సిబ్బందికి గౌరవం పెరిగింది. 2009లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలో చేరాను. 2013లో నాకు రెగ్యులర్ అయింది. ఉద్యోగంలో చేరిన తర్వాత జహీరాబాద్, మెదక్ డిపోల్లో పనిచేశాను. ప్రస్తుతం నర్సాపూర్ డిపోలో కండక్టర్‌గా, సిస్టం సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో సాకారమైంది. ఇంతకుముందు ప్రభుత్వం ఉద్యోగం కాకుండా కార్పొరేషన్ స్థాయిలో విధులు నిర్వర్తించాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మాకు ఉద్యోగ భద్రత పెరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగిగా గర్వంగా చెప్పుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారు. ప్రభుత్వంలో విలీనంకావడంతో మా జీతాలు పెరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ సిబ్బంది మరిచిపోలేం. ఆర్టీసీ సిబ్బంది తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీఎం కేసీఆర్ వెంటే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు.
-కె. వెంకట్ గౌడ్, కండక్టర్, సిస్టం సూపర్వైజర్, నర్సాపూర్ డిపో
హుస్నాబాద్ టౌన్, జూలై 31: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషంగాఉన్నది. ఎన్నో ఏండ్లనుంచి ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నది. మమ్ముల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషాన్ని ఇస్తున్నది. ఆర్టీసీ కార్మికుల త్యాగాలు వృథాకాలేదని సీఎంకేసీఆర్ నిరూపించినందుకు కృతజ్ఞతలు.
– కేఎస్చారి, ఆర్టీసీ డ్రైవర్, హుస్నాబాద్
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్ మంచి శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండినైట్లెంది. ఆర్టీసీ ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆర్టీసీ కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి వర్గానికి ఆర్టీసీ కార్మికులు రుణపడి ఉంటారు. సీఎం కేసీఆర్, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు.
– బెక్కంటి రమేశ్, ఆర్టీసీ డ్రైవర్, హుస్నాబాద్
దుబ్బాక, జూలై 31: సమైక్యంధ్ర ప్రభుత్వాల్లో ఆర్టీసీ నష్టల్లో ఉండేది. మన సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీని బలోపేతం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషకరం. క్యాబినెట్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ సర్కారులోనే సముచిత న్యాయం జరిగింది. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు.
– బల్ల గోపాల్, ఆర్టీసీ కండక్టర్, దుబ్బాక డిపో
దుబ్బాక, జూలై 31: నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సీఎం కేసీఆర్ జీవం పోసి కార్మికులను కాపాడుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని అభిమానం. సీఎం కేసీఆర్ ఆనాడు ఆర్టీసీ మంత్రిగా ఉన్నపుడు కార్మికుల సమస్యలను ప్రత్యేక్షంగా చూశారు. నేడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సరైన గౌరవం కల్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కోదారి రమేశ్, ఆర్టీసీ కండక్టర్, దుబ్బాక డిపో
నేను 13 సంవత్సరాలుగా దుబ్బాక ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నా. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయంతో మా సంస్థలో పనిచేస్తున్న మాలాంటి ఎంతోమంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హోదా లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు.
– జీడి శివకుమర్గౌడ్, ఆర్టీసీ డ్రైవర్, నిజాంపేట
టీఎస్ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరం. కార్మికుల కల నెరవేరింది. మొదటి నుంచి సీఎం కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం నిర్ణయంతో మంచి రోజులు వచ్చాయి. బతుకుకు భరోసా కలిగింది. పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయంతో కార్మికులందరికీ పూర్తి స్థాయి న్యాయం జరిగింది. మేమంతా రుణపడి ఉంటాం. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
-ఎండీ. నిజాం, కండక్టర్, దుబ్బాక
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు. గతంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన మహనీయుడు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. కానీ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. వేల కుటుంబాలు నేడు సంతోషంగా పండుగ చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాలమణి, కండక్టర్, దుబ్బాక
నేను కొన్నేండ్లుగా జనగామ డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని వేతనాలకు ఉద్యోగం చేస్తున్నాం. పెరిగిన ఖర్చులతో మేము కుటుంబాలను పోషించుకులోని దుస్థితి ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని గతంలో ఎన్నో పోరాటాలు చేశాం. అయినా మమ్ములను ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ పెంచిన 44శాతం ఫిట్మెంట్తో కొంతమేర వేతనాలు పెరిగాయి. సీఎం కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. మా కుటుంబాలకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఎన్ని జన్మలైనా సీఎం కేసీఆర్ మాకు చేసిన మేలను మర్చిపోలేం.
– షాదుల్లాపాషా, ఆర్టీసీ డ్రైవర్, అర్జున్‌పట్ల
నేను ఉప్పల్ డిపోలో గత కొన్నేండ్లుగా ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నా. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మేము కలలో కూడా ఊహించలేదు. ఆర్టీసీ ఉద్యోగులు పడుతున్న బాధలు సీఎం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే గతంలో వేతనాలు పెంచారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషంగా ఉన్నది. ఈ రోజును మేము జీవితంలో ఎన్నడూ మరువలేం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ వెంటే ఆర్టీసీ ఉద్యోగులు ఉంటారు.
-బెడద కొమురయ్య, కండక్టర్, లద్నూర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలుపడాన్ని స్వాగతిస్తున్నాం. కార్మికుల కలలను సీఎం కేసీఆర్ నిజం చేశారు.ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో నూతన కాంతులు వెలుగుతున్నాయి. ప్రభుత్వానికి యూనియన్ పరంగా ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-మౌలానా, నేషనల్ మజ్జూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి