నర్సాపూర్, డిసెంబర్ 1: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కొండాపూర్ నుంచి సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం షేర్ఖాన్పల్లి వరకు రహదారి గుంతమయంగా మారింది. ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు అధ్వానంగా మారడం వల్ల వాహనదారులతోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వర్షాకాలంలో రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గుంత ఉందో తేల్చుకోలేక వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ రోడ్డుపై వెళ్లిన వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
గతంలో నర్సాపూర్ నుంచి పటాన్చెరువు వరకు ఈ మార్గంలోనే బస్సులు నడిచేవి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు పటాన్చెరుకు వెళ్లడానికి అనుకూలంగా ఉండేది. కానీ, కొన్ని రోజుల నుంచి రోడ్డు బాగాలేదని, బస్సులు పాడైపోతున్నాయని ఈ రూట్లో ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేశారు. దీంతో దౌల్తాబాద్ మీదుగా చుట్టూ తిరిగి పటాన్చెరుకు వెళ్లాల్సి వస్తున్నది. సమ యం, డబ్బులు వృథా అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. విద్యార్థులు చేసేది లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొండాపూర్ నుంచి షేర్ఖాన్పల్లి వరకు రోడ్డుకు మరమ్మతులు చేయించి బస్సులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రోడ్డుపై వెళ్లాలంటేనే ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని వెళ్లాల్సి వస్తున్నది. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో అర్థంకావడం లేదు. ఇక రాత్రి సమయంలో ప్రయాణం చేయాలంటేనే భయమేస్తున్నది. రోడ్డుపై ప్రమాదాలు జరిగి చాలామంది గాయాలపాలయ్యారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలి.
– శ్రీకాంత్, కాగజ్మద్దూర్
మా గ్రామం నుంచి నర్సాపూర్, పటాన్చెరుకు వెళ్లాలంటే బస్సులు రాక అవస్థలు పడుతున్నాం. ఒకప్పుడు ఈ రూట్లో బస్సు నడిచినప్పుడు మంచిగా ఉండేది. రోడ్డు బాగా లేదని అధికారులు బస్సులు నిలిపివేశారు. విద్యార్థులు కాలేజీలకు వెళ్లడానికి బస్సులు లేక తిప్పలు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలి.
-ఆంజనేయులు, కాగజ్మద్దూర్