మెదక్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): పండుగలను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం మోపుతున్నది. రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ పేరిట బాదింది. బస్టాండ్లలో రద్దీని ఆసరా చేసుకొని స్పెషల్ బస్సులు దించింది. మెదక్ నుంచి జేబీఎస్‌కు సాధారణంగా డీలక్స్ బస్సు చార్జీ రూ.160 ఉండగా, దానికి రాఖీ పండుగ సందర్భంగా రూ.220కు పెంచేశారు. అంటే అదనంగా రూ.60 చార్జి వసూలు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న అక్కాచెల్లెళ్లు మెదక్‌కు రావాలంటే ఆర్టీసీ స్పెషల్ పేరిట భారం మోపింది. దీంతో ఆర్టీసీ తీరుపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా మూడు రోజులు సెలవులు
శుక్రవారం, శనివారం, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో మెదక్ జిల్లాలోని పలు బస్టాండ్‌ల్లో రద్దీ పెరిగింది. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాల్సిన ఆర్టీసీ యాజమాన్యం స్పెషల్ పేరిట బస్సులను రంగంలోకి దించింది. వరుసగా సెలవులు రావడం, అందులో రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలతో పాటు కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ దూరాన్ని బట్టి సుమారు 20 నుంచి 30శాతం వరకూ బస్సు టికెట్ల ధరలు పెంచి దండుకుంటున్నది.
మెదక్ జిల్లాలో 35 స్పెషల్ బస్సులు
రాఖీ పండుగ కోసం మెదక్ జిల్లా ఆర్టీసీ డిపో 35 బస్సుల వరకు రద్దీకి తగ్గట్టుగా తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రద్దీగా ఉన్న రూట్లను అంచనా వేసి ఆయా రూట్లకు బస్సులు పంపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న ఆర్టీసీ, రాఖీపండగ సందర్భంగా నిలువునా దోచుకుంటున్నది.
కొన్ని స్పెషల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం జీరో టికెట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. రాఖీ పండుగ కోసం కుటుంబం మొత్తం బస్సులో సొంతూళ్లకు వెళ్లాలంటే అడ్డగోలు భారం మోయాల్సి వస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లాలంటే అదనంగా రూ.240 భరించాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్లీ తిరిగి వెళ్లాలంటే రూ.240 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలపై భారం పడుతోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.