పటాన్చెరు, నవంబర్ 4 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామ శివారులోని కంకర క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లతో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు.దీంతో ప్రతిరోజు 65వ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేపై యూటర్న్ ఉన్న ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నా, టిప్పర్ డ్రైవర్లు వేగం తగ్గించడం లేదు. అధిక లోడ్‌తో టిప్పర్లు తిరుగుతుండడంతో రోడ్లపై గుంతలు పడుతున్నాయి. ఓవర్ తోడ్తో కంకర తరలిస్తున్నా టిప్పర్లపై చర్యలు కరువయ్యాయి. రవాణా, పోలీసు, భూగర్భగనులు, విజిలెన్స్ శాఖ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేసి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై ప్రమాద హెచ్చరిక బోర్డులు, వేగనియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. క్వారీలు నుంచి వస్తున్న టిప్పర్లు రోడ్డుపైకి రాగానే దుమ్ముధూళి, వాయుకాలుష్యం ఎక్కువవుతున్నది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయి కెపాసిటీకి మించి కంకర తరలిస్తున్న టిప్పర్లను తనిఖీ చేశారు. టిప్పర్ కెపాసిటీ 20-30 టన్నులు కాగా, 40-50 టన్నుల వరకు కంకర తరలిస్తున్నారు. దీంతో అధిక లోడ్‌తో సకాలంలో బ్రేక్ పడక, స్టీరింగ్ తిరగక టిప్పర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్డారం క్వారీ నుంచి ప్రతిరోజు టిప్పర్ల ద్వారా రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాలకు కంకర తరలిస్తారు. కెపాసిటీకి మించిన కంకర తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఎవరైనా ఫిర్యాదు చేసినా టిప్పర్ యాజమాన్యాలపై చర్యలకు పోలీసులు వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కార్లు, ఆటోలు, ఇతర వాహనాలను టిప్పర్ ఢీకొట్టినా యాజమాన్యాలు స్పందించడం లేదు.మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేసి 14 టిప్పర్లపై కేసులు నమోదు చేశారు. పటాన్చెరు మండలంలోని లక్డారం, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం గ్రామాల యూటర్న్ల వద్ద టిప్పర్లతో ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధిక లోడ్‌తో వెళ్తున్న 14 టిప్పర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎంవీఐ విజయ్‌రావు మీడియాకు వెల్లడించారు. ముత్తంగి, సుల్తాన్‌పూర్‌లో వాహన తనిఖీలు చేసి ఓవర్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లను గుర్తించినట్లు తెలిపారు. 25 టన్నుల లోడ్ పరిమితి ఉండే టిప్పర్‌లో 25 నుంచి 35 టన్నుల వరకు కంకర తరలిస్తున్నారని, 10 టన్నుల లోడ్ పరిమితి ఉంటే 15 నుంచి 20 టన్నులు తీసుకు పోతున్నారని, ఇకపై ప్రతిరోజు వాహన తనిఖీలు చేస్తామని ఎంవీఐ విజయ్‌రావు తెలిపారు.