రామచంద్రాపురం, ఏప్రిల్ 22 : గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, బల్దియా పరిధి లో ప్రధాన రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్లకు కొత్త వైభవం వచ్చింది. ఎటుచూసినా బీటీ, సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏరియాలో రియ ల్ ఎస్టేట్, వాణిజ్య వ్యాపారం జోరుగా సాగుతున్నది. భూముల ధరలు భారీగా పెరిగాయి. నగర శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రేడియల్, రీజినల్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. హైదరాబాద్‌కు శివారు ప్రాంతంగా ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో దూసుకు పోతుంది. తెల్లాపూర్ మీదుగా రూ.293 కోట్లతో రెం డు రేడియల్ రోడ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. రింగు రోడ్డుని కనెక్ట్ చేస్తూ శేరిలింగంపల్లి పరిధిలోని గోపన్‌పల్లి తండా నుంచి తెల్లాపూర్ మీదుగా కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెన్షన్ 30, తెల్లాపూర్ నుంచి ఈదుల నాగులపల్లి మీదుగా రంగారెడ్డి జిల్లా మోకిల వరకు ఎక్స్టెన్షన్ 7 రేడియల్ రోడ్లను ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్నది. ఇప్పటికే రేడియల్ రోడ్లకు సంబంధించి డబుల్ లేన్ పనులు పూర్తయ్యాయి.
శరవేగంగా అభివృద్ధి..
రేడియల్ రోడ్ల ఏర్పాటుతో తెల్లాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాలకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు వందల సంఖ్య లో వచ్చాయి. డూప్లెక్స్ విల్లాస్తో పాటు హైరైస్ అపార్ట్మెంట్లకు సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నారు. రియల్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
రూ. 293 కోట్లతో రేడియల్ రోడ్లు
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నది. రేడియల్ రోడ్డు ఎక్స్టెన్షన్ 30లో భాగంగా గోపన్‌పల్లి తండా నుంచి కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు ఒకటి, నలగండ్ల నుంచి తెల్లాపూర్ మీదుగా మోకిల వరకు ఎక్స్టెన్షన్ 7లో భాగంగా మరో రేడియల్ రోడును అభివృద్ధి చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ 30 రోడ్డును రూ. 103 కోట్లు, ఎక్స్టెన్షన్ 7 రోడ్డును రూ.190 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ రెండు రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 293 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఎక్స్టెన్షన్ 30లో భాగంగా 7.8 కిలోమీటర్ల రోడ్డులో 1.6 కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. 6.2 కిలోమీటర్లు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఎక్స్టెన్షన్ 7లో తెల్లాపూర్ నుంచి మోకిల వరకు 10.5 కిలోమీటర్ల మేర రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు. రేడియల్ రోడ్లు ఆరులేన్లుగా ఉండడంతో పాటు మధ్యలో డివైడర్, లైటింగ్ సిస్టమ్, ఇరువైపులా ఓపెన్ డ్రైన్స్, వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేయనున్నారు.
రోడ్ల అభివృద్ధికి పెద్దపీట..
అభివృద్ధి వేగంగా జరగాలంటే ముందు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చాలి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో పూర్తి స్థాయిలో రోడ్లు అభివృద్ధి చేశాం. తెల్లాపూర్‌లోనే రూ.293 కోట్లతో రెండు రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. రూ.45 కోట్లతో బీరంగూడ కమాన్ నుం చి కిష్టారెడ్డిపేట వరకు వంద ఫీట్ల రోడ్డు వేశాం. రోడ్ల ను అభివృద్ధి పర్చడంతో పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది.
– గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, పటాన్చెరు మెరుగైన రవాణా సౌకర్యం
తెల్లాపూర్ మున్సిపాలిటీలో రూ. 293 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నది. దీంతో తెల్లాపూర్ నుంచి రంగారెడ్డి జిల్లా మోకిల వరకు శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నది. రేడియల్కు సంబంధించి డబుల్ లేన్ పనులు పూర్తి కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. తెల్లాపూర్ నుంచి వెలిమెల వరకు రియల్ఎస్టేట్, వాణిజ్యం, ఫుడ్‌కోర్టుల వ్యాపారం జోరుగా సాగుతున్నది.
– లలితాసోమిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రోడ్లను బాగా అభివృద్ధి చేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను బాగా అభివృద్ధి చేస్తున్నది. తెల్లాపూర్ పరిధిలో వంద ఫీట్లకు సంబంధించి రెండు రేడియల్ రోడ్లను వేస్తున్నది. రోడ్డు పనులు పూర్తి కావడంతో వాహనదారులు సాఫీగా ప్రయాణిస్తున్నారు. రేడియల్ రోడ్లు పూర్తిగా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతానికి కొత్త కళ వస్తుంది. రేడియల్ రోడ్ల ఏర్పాటుతో తెల్లాపూర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. – నవీన్‌చంద్ర సామల, సీఈవో, నోమెరిట్ ప్రైవేట్ లిమిటెడ్