సిద్దిపేట అర్బన్,అక్టోబర్ 9: జ్ఞాన సమాజమే లక్ష్యంగా, విద్యనే ఆయుధంగా మలుచుకొని స్వేరో నెట్వర్క్ పనిచేస్తుందని స్వేరోస్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలో బుధవారం స్వేరోస్ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ..2012 అక్టోబర్ 22న ఎస్ఆర్ శంకరన్ జయంతి సందర్భంగా స్వేరోస్ ఆవిర్భవించిందని తెలిపారు. స్వేరో నెట్వర్క్ ఏర్పడి దశాబ్ద అయిందన్నారు.
తెలంగాణలోనే కాకుండా దేశంలోని మరికొన్ని రాష్ర్టాల్లో స్వేరో విస్తరించిందన్నారు. ఈ నెల 27న బెజ్జంకిలో జరిగే స్వేరోస్ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమంలో స్వేరోస్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. గురుకుల విద్యాసంస్థల ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషిచేస్తున్నదన్నారు. స్వేరో నెట్వర్క్ ఎన్నో సామాజిక రుగ్మతలపై పోరా టం చేసిందన్నారు. పాఠశాల్లలో డ్రాపౌట్ అయిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం జరిగిందని, సిగరెట్, గుట్కా, మద్యపానం, వరకట్నం నిషేధంపై పోరాటం చేసిందన్నారు.
కుల మతాలకు అతీతంగా స్వేరోస్ పని చేస్తుందని, సామాజిక బాధ్యత ఉన్న ఎవరైనా స్వేరోలో చేరవచ్చని తెలిపారు. భారత్‌లోనే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా స్వేరోస్ విస్తరించిందన్నారు. కార్యక్రమంలో స్వేరో నెట్వర్క్ స్టేట్ కన్వీనర్ దుర్గయ్య, పీపీఎల్ కన్వీనర్ వీరన్న, స్పోర్ట్స్ కన్వీనర్ సోములు, జిల్లా స్వేరో అధ్యక్షుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నికృష్ణ, ఉమ్మడి జిల్లా పీపీఎల్ అధ్యక్షుడు శంకర్, పీపీఎల్ స్టేట్ కోఆర్డినేటర్ జనార్దన్, స్వేరో ప్రతినిధులు బాలకిషన్, సురేశ్‌కుమార్, ప్రవీణ్ పాల్గొన్నారు.