వంటింట్లో మరోసారి గ్యాస్ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. సామాన్య, పేద ప్రజలపై మరింత భారం మోపింది. సిలిండర్ ధరను తరచూ పెంచుతుండడంతో పాటు సబ్సిడీకి మంగళం పాడడంతో మోదీ సర్కారుపై మహిళా లోకం మండిపడుతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో జనం అల్లాడిపోతుండగా, గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) సిలిండర్ ధర రూ.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచి సామాన్యుల నడ్డి విరిచింది. సంగారెడ్డి జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 5.66,858 ఉండగా, మెదక్ జిల్లాలో1,71,361 ఉన్నాయి. బుధవారం గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.
సిద్దిపేటలో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ధరల పెంపుపై బీఆర్ఎస్ నేతృత్వంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పోచమ్మ పొతం చేస్తే మైసమ్మ మాయం చేసిన చందమిది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై ధరల భారం వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం గృహోపకార గ్యాస్ ధరలు పెంచుతూ పెనుభారం మోపుతున్నది. గత ఏడాది లెక్కకు మించి గ్యాస్ ధరలు పెంచి ప్రజలను అయోమయానికి గురిచేసిన విషయం మరువక ముందే మరోసారి ధరల మోత మోగిస్తూ గ్యాస్ వినియోగం గుదిబండగా మార్చిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.
సిద్దిపేట, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్ (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి: గ్యాస్ బుడ్డి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు గుదిబండగా మారుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో పేద కుటుంబాల్లో గ్యాస్ వెలిగించకుండానే సెగ తగులుతున్నది. బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. రోజంతా చేసిన కష్టం గ్యాస్ బుడ్డిలకే అయ్యేట్టు ఉందంటూ పేద కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ‘సామాన్య కుటుంబాల గోడు బీజేపీ సర్కార్‌కు పట్టదు.. చెప్పేది ఒకటి చేసేది మరొకటి’… అంటూ మహిళలు బీజేపీ సర్కార్‌కు శాపనార్ధాలు పెడుతున్నారు. తాజాగా మోదీ సర్కార్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచగా, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచింది. గృహావసరాలకు (డొమెస్టిక్) వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను ఏకంగా రూ.50 పెంచడంతో సర్వత్రా ఆందోళన చెందుతున్నారు.
కొత్త ఏడాదిలో ఇది రెండోసారి…
2023లో ప్రారంభంలో జనవరి 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ ప్రకటించి అమలు చేసిన చమురు కంపెనీలు మరోసారి గృహ వినియోగదారులపై ధరల మోతలు మోగించేందుకు సిలిండర్‌పై రూ.50 పెంచింది. కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 మేర పెంచుతునట్లు చమురు కంపెనీలు ప్రకటించడంతో చిన్నచిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్న వ్యాపారుల పరిస్థితి ఆందోళనకరంగా మారనున్నది. దీంతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.2119.50కు చేరనున్నది. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తివేయడంతో సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనున్నది. నిత్యం సరుకులు కొనుగోలు చేసే మధ్యతరగతి ప్రజలపై గ్యాస్ ధరలు ప్రభావం పడనున్నదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ప్రజల నడ్డి విరుగుతున్నది. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలతో ఆ భారం మరింత పెరగనున్నండడంతో ప్రజలకు దిక్కతోచని విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.
చమురు కంపెనీల ఇష్టానికి ధరల పెంపు అంశం…
చమురు కంపెనీలు ఇష్టానుసారంగా గ్యాస్ ధరలు పెంచుకునేలా స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం కల్పించడంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ధరలు పెంచుకునేలా స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం కల్పించడం ద్వారా ధరల భారానికి దారులు వేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాదిలో ఏకంగా రెండోసార్లు గ్యాస్ ధరలు పెంచడం ద్వారా బీజేపీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న విషయం మరోసారి ప్రస్ఫుటమైందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ధరల పెంపుపై నిరసన సెగలు…
కాగా బుధవారం సిద్దిపేట జిల్లాలో గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. శుక్రవారం (రేపు) అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో 5,66,857 కనెక్షన్లు..
జిల్లా ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని రకాల గ్యాస్‌లు 5,66,857 కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల నివేదికలను బట్టి తెలుస్తున్నది. జిల్లాలో సాధారణ కనెక్షన్లు 358102 ఉండగా, సీఎస్ఆర్ కనెక్షన్ల సంఖ్య 72176. దీపం పథకం ద్వారా ఇచ్చిన కనెక్షన్లు 88563 కాగా, ఉజ్వల యోజన పథకం కింద మంజూరు చేసిన కనెక్షన్లు 48017 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజలు ఇబ్బందులకు గురికావొద్దనే ఉద్దేశంతో ప్రతి ఇంటికీ గ్యాస్ కనెక్షన్లు అందజేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించిన విషయం తెలిసిందే. మళ్లీ నెలకోసారి ధరలు పెంచుతుండడంతో మహిళలు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు కూ డా కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.
మెదక్ జిల్లాలో 1,71,361
మెదక్ జిల్లాలో సింగిల్ సిలిండర్లు 86,796 ఉండగా, డబుల్ సిలిండర్లు 32,967 ఉన్నాయి. సీఎస్ఆర్ 35,327 కాగా, ఉజ్వల సిలిండర్లు 16,271 ఉన్నాయి. మొత్తం 1,71,361 సిలిండర్లు ఉన్నాయి. మార్చి నెల ప్రారంభంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగి సామాన్యులకు భారంగా మారింది. ఇదిలా ఉండగా గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించేది. కానీ ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేయడంతో సామాన్యుల జేబులకు భారీగా చిల్లు పడనుంది.
సిద్దిపేట జిల్లాలో 2,91,661
సిద్దిపేట జిల్లాలో 2,91,661 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 1,11,352 సిలిండర్లు వినియోగిస్తున్నారు. ఈ లెక్కన 1674 టన్నుల గ్యాస్ వినియోగం జరుగుతున్నది. జిల్లాలో మూడు చమురు సంస్థలకు సంబంధించి 19 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర రూ.50 పెంచడంతో సామన్యులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఒకవైపు చాలీచాలని జీతాలతో కుంటుంబాన్ని నెట్టుకు వస్తుంటే, ఇటు వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు మరింత భారంగా మారాయి. నిత్యావసరమైన వంట గ్యాస్‌పై మళ్ళీ రూ. 50 పెంచి సామన్యుల నడ్డి వీరిచే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నాడు రూ.460 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1160కి తీసుకొచ్చారు. మార్చి 8వ తేదిన మహిళా దినోత్సవం ఉందని వారందరికి బహుమతిగా మోదీ ప్రభుత్వం వారి నడ్డివిరిచే కార్యక్రమం
చేపట్టారు.
– చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే, అందోల్
మరోసారి ధరలు పెంచి భారం మోపింది
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలు ఉపయోగించే గృహావసరాల వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచి మరోసారి పేదలపై భారం మోపింది. మేఘాలయ ఎన్నికలు పూర్తికాగానే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్‌పై రూ.350 పెంచడం ఎంతవరకు సమంజసం? ధరలు తగ్గిస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోదీ ఎనిమిదేండ్లుగా నిత్యావసరాల ధరలు విఫరీతంగా పెంచారు. దేశ ప్రజల సంక్షేమానికి నిధులు ఖర్చు చేయని మోదీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు రాయితీలు ఇస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మోదీ ఇస్తున్న బహుమతి గ్యాస్ ధరల పెంపేనా? బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
– చింత ప్రభాకర్, రాష్ట్ర చేనేత అభివృద్ధి చైర్మన్
ధరలను పెంచడం కేంద్రం అలవాటు..
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు అయిన వెంటనే గ్యాస్ తదితర ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వం అలవాటుగా మార్చుకొన్నది. గతంలో రూ.400 ఉండే గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1200లకు చేరిందన్నారు. బీజేపీ పాలకులు అసమర్థ పాలనతో ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారు. నిత్యావసరాల ధరలు కూడా పెంచడంతో బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఉజ్వల పథకం కింద ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా గ్యాస్‌బండ పొందిన మహిళ కూడా కట్టెల పొయ్యి ఉపయోగిస్తుండడం సిగ్గుచేటు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ సర్కారు వారికిస్తున్న గౌరవం, వరం ఇదే! రాబోయే రోజుల్లో బీజేపీకి గుణపాఠం చెప్పడం ఖాయం.
– మాణిక్‌రావు, ఎమ్మెల్యే, జహీరాబాద్
నిరసనలు చేపడుతాం
ప్రధాని మోదీ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నిరసన కార్యక్రమాలను చేపడుతాం. ఈనెల 3న ఉదయం 10 గంటలకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడతాం. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మహిళ సంఘాలు, రైతు సంఘాలు, ఆత్మకమిటీ చైర్మన్లు డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి. కేంద్ర ప్రభు త్వం గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ పేదల నడ్డి విరుస్తుంది. చేశారు. అందరూ ఈ నిరసనలో పాల్గొని విజయవంతం చేయాలి.
– మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్
ఎలా వంట చేసుకోవాలి…
గ్యాస్ ధరలు పెంచి సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోదీ ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నారు. పెరిగిన ధరలతో గ్యాస్‌పై వంట చేసుకునే పరిస్థితి లేదు. ఇలాగైతే త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం.
– రాణి (జక్కన్నపేట, హవేళీఘణాపూర్ మండలం)
ఆగ్రహం తెప్పిస్తున్న బీజేపీ ప్రభుత్వం..
పెరుగుతున్న సిలిండర్ ధరల పైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న సిలిండర్ ధరలు, నిత్యావసర సరుకుల పెరుడుదలపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఈ రోజు రూ.1200కు చేరుకుంది. ప్రతీ రోజు ఏదో ఒక రూపంలో ధరలు పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
– బెండ పద్మావతి, గృహిణి, మెదక్ పట్టణం
కార్పొరేట్ కొమ్ముకాస్తున్నమోడీ ప్రభుత్వం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంది. కార్పోరేట్ కంపెనీలపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదు. సిలిండర్ ధరలను అమాంతం పెంచి సామాన్య మహిళలకు గ్యాస్ సిలిండర్‌ను కేంద్ర ప్రభుత్వం దూరం చేస్తుంది. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు.
– బూర విజయ, బీఆర్ఎస్ మహిళా నేత, సిద్దిపేట
పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి..
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి. లేదంటే మా మహిళా శక్తి అంటే ఎందో చూపిస్తాం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెంపుతో ఇబ్బందులు పడుతున్నాం. మళ్లీ గ్యాస్ ధర పెంచి సామాన్య ప్రజల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం.
– కే.అనూష, గృహిణి, సిద్దిపేట
సబ్సిడీ పైసలు పడతలేవు
గ్యాస్ ధర రోజింత రోజింత పెరుగుతంది. ఇప్పటికే పన్నెండువందల రూపాయల దాక సేసిండ్రు. సబ్సిడీ అన్నరు కాని ఒక్కరూపాయికూడ బ్యాంకుల పడతలేదు. ఆరునెల్లనుంచి సూతన్న ఒక్క రూపాయిరాలే. కూలీకైకిలి చేసి సంపాయించిన పైసలు అన్ని గ్యాస్‌కే పోతున్నవి. గిట్లయితే గ్యాస్ బంద్‌జేసి కట్టెలతోనే వంటచేసుకునుడు అయితది. ఒక్కటొక్కటీ అన్నింటి ధరలు ఇట్లా పెంచుకుంటా పోతే బతుకుడు కష్టమైతది.
– బత్తిని వెంకవ్వ, హుస్నాబాద్ టౌన్
గ్యాస్ రేటు పెంచితే ఎలా..?
రోజురోజుకూ గ్యాస్ రేటును పెంచుతూనే ఉన్నరు. ఇట్లయితే మేము ఎలా భరించాలి. ఇంట్లో వంటలు వండుకోవడానికి చాలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై నిరసన ప్రారంభించాలి. గ్యాస్ ధర తగ్గించేవరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేవాళ్లకు ప్రజలంతా కలిసి తగిన బుద్ది చెప్పడం ఖాయం.
– తారాబాయి (పీచెర్యాగడి తండా, కోహీర్ మండలం)
పేదలంటే ఏమాత్రం ప్రేమ లేదు…
కేంద్ర ప్రభుత్వానికి పేదలంటే ఏమాత్రం ప్రేమ లేదు. గ్యాస్ ధరతోపాటు, పెట్రోల్ డీజిల్ తదితర ఇంటి వినియోగ వస్తువుల ధరలను కూడా చాలా పెంచేసింది. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ఈ దేశంల పేదోళ్లు బతుకుడు గింత కష్టమైతుంది. ప్రజల బతుకులతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతుంది.
– గాండ్ల కల్పన, (కొత్తూర్ (కే) గ్రామం, కోహీర్ మండలం)
కట్టెల పొయ్యి దిక్కు…
గ్యాస్ ధర మళ్లిమళ్లి పెరుగుతుండడంతో గ్యాస్ బండను పెట్టినం. కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నం. కట్టెల పొయ్యి మీద వంటలు చేయాలంటే కండ్ల వెంబడి నీళ్లు వస్తున్నయి. అన్ని రకాల ధరలు పెరుగుతుండడంతో ఆడవాళ్లకు చాలా కష్టాలు వచ్చినయి. ఏ నాయకుడైనా సీఎం కేసీఆర్ సార్ లాగా సేవ చేయాలి. సిలిండర్ ధరలను అమాంతం పెంచి సామాన్య మహిళలకు గ్యాస్ సిలిండర్‌ను కేంద్ర ప్రభుత్వం దూరం చేస్తుంది.
– లచ్చమ్మ (రాజనెల్లి గ్రామం, కోహీర్ మండలం)
బీజేపీకి గుణపాఠం తప్పదు
ఇప్పటికే భరించలేని స్థాయిలో ఉన్న వంట గ్యాస్ ధరను మళ్లీ రూ.50 పెంచడం శోచనీయం. సామాన్యుడిపై గ్యాస్ బండను మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదు. ఒక్క గ్యాస్ మాత్రమే కాదు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ సామాన్య ప్రజలను గోస పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు ఇప్పట్నుంచే ప్రారంభవుతున్నాయి.
– ఏ.నందాదేవి, బీఆర్ఎస్ మహిళా నేత, సిద్దిపేట