పాపన్నపేట, సెప్టెంబర్ 19: గత నెల రోజులుగా కురుస్తున్న వానలతో ఎల్లాపూర్ వద్ద మెదక్-బొడమెట్పల్లి రోడ్డుపై పెద్ద కాలువ ఏర్పడి ప్రమాదకరంగా (Road Damage) మారింది. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ రహదారి మీదుగానే కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ప్రధాన పట్టణాలైన బీఆర్, జహీరాబాద్, నారాయణఖేడ్ తదితర ప్రాంతాలకు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట వెళ్లే ద్విచక్రవాహన దారులు ఈ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. గురువారం పొడిచాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఈ కాలువలో పడి గాయడ్డారు. స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు.
ఈ రోడ్డు చెడిపోవడంతో పండుగ సామాగ్రి, దసరా బట్టలు తీసుకోవడానికి మెదక్ పట్టణానికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఈ రోడ్డు గుండా నిత్యం వివిధ మండలాల తనిఖీ కోసం వెళ్తుంటారు. అయినా ఆయన స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమతు చేయించాలని కోరుతున్నారు.