పటాన్చెరు రూరల్, మే 25: అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లపై చర్యలకు సంబంధిత అధికారులు వెనుకాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెట్టింపు కంకరను బిల్డర్ల వద్దకు తరలించి వాహన యజమానులు సొమ్ముచేసుకుంటున్నారు. అధిక లోడుతో వాహనాలు తిరుగుతున్నాయని రవాణాశాఖ సిబ్బంది తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని, వాటికి టిపర్ల వారీగా టార్గెట్లు ఖాయం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లక్డారం నుంచి నిత్యం అధిక లోడుతో వెళ్తున్న వందలాది వాహనాలతో మైనింగ్‌శాఖకు ఆదాయం నష్టం జరుగుతున్నది. వేబిల్లు ప్రకారం, అనుమతించిన బరువుతో కంకర, డస్ట్ సరఫరా చేస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని ఎగ్గొట్టేందుకు అటు క్రషర్ల యజమానులు, టిప్పర్ల యజమానులు అధికలోడుతో వాహనాలను నింపి సరఫరా చేస్తున్నారు.
వాటిని పట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన రవాణాశాఖ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్న సగానికి పైగా రోడ్డు ప్రమాదాలు కంకర, ఇసుక, డస్ట్, మట్టికొట్టే టిప్పర్లే కారణం. అటు మైనింగ్‌శాఖ, ఇటు రవాణశాఖ అధికారుల నిఘా కరువైంది. టిప్పర్లతో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి వాటిని నివారించేందుకు పోలీసులు అధికారులు ప్రత్యేకంగా క్రషర్ల డైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు.
పదుల సంఖ్యలో క్రషర్లు…
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో లక్డారంలో ముప్పై వరకు క్రషర్లు ఉన్నాయి. వీటిలో వందల టిపర్లు కంకర, రాళ్లు, డస్ట్‌ను అర్డర్లున్న ప్రాంతాలకు తరలిస్తాయి. ఒక్కో టిప్పర్ సామర్థ్యానికి మించి రెట్టింపు కంకర, డస్ట్, రాళ్లను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి కెపాసిటీ 30 టన్నులు ఉండగా, టిప్పర్లలో 50 నుంచి 60 టన్నుల వరకు తరలిస్తుండడంతో టిప్పర్ యజమానులకు రెట్టింపు ఆదాయం సమకూరుతున్నది. డీజిల్ ఖర్చు, లేబర్ ఖర్చు కలిసి వస్తున్నది.
ఇదే సందర్భంలో ఈ అధిక లోడు వాహనాల ద్వారా ప్రభుత్వ మైనింగ్ శాఖకు కట్టాల్సిన పన్నులు సగం మాత్రమే కడతారు. అధిక బరువులో తీసుకెళ్లిన మెటీరియల్‌కు ఎలాంటి పన్ను చెల్లింపు ఉండదు. ఇలా నిత్యం వందలాది ట్రిప్పుల కంకర, రాళ్లు, డస్ట్ తరలించి వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
అటు మైనింగ్‌శాఖ నుంచి నియంత్రణ లేకపోవడంతో క్రషర్ల యజమానులు, టిప్పర్ల యజమానులకు ఆడింది ఆటగా, పాడింది పాటగా మారింది. ఒక్కో క్రషర్లో ఎంత మెటీరియల్ పోతుంది. ఎంత పన్ను కడుతున్నారు అనే నిఘా కరువైంది. మైనింగ్‌శాఖ అధికారులు తూతూమంత్రపు తనిఖీలతో క్రషర్ల యజమానులకు, టిప్పర్ల యజమానులకు సహకరిస్తున్నారనే ప్రచారం ఉంది. రాజకీయ నేతల కక్షసాధింపు కోసం కొన్ని క్రషర్లపై మాత్రం గట్టి చర్యలే తీసుకు న్నారని సమాచారం.
అధికలోడు వాహనాలపై అధికారుల టోల్…
అధికలోడు వాహనాలను నడుపుతున్న క్రషర్ల యజమానులకు, టిప్పర్ల యజమానులకు రవాణాశాఖ సిబ్బంది నెలకింత చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మీరు లబ్ధి పొందుతున్నారు, మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా..? అంటూ నిర్మోహమాటంగా ముక్కు పిండి సిబ్బంది వసూలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే వాహనానికి ఇంత ఇవ్వాలనే సిబ్బంది డిమాండ్‌పై టిప్పర్ల యజమానుల మధ్య తీవ్రమైన చర్చలు జరిగి విషయం బయటకు పొక్కింది. ఈ డిమాండ్‌పై పలువురు క్రషర్ల యజమానులు కల్పించుకొని ధర ఖాయం చేసినట్టు ప్రచారంలో ఉంది.
అదే సమయంలో అధిక బరువుతో ప్రయాణిస్తున్న వాహనాలతో బ్యాతోల్, లక్డారం, ఎన్‌హెచ్-65 వరకు వేసిన రోడ్లపై తరుచూ గుంతలు తేలుతున్నాయి. ఆర్అండ్బీ మెయింటైన్ చేస్తున్నా ఈ రోడ్డు తక్కువ కెపాసిటీ కలిగినది. అధిక లోడు వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు ఏటా దెబ్బతింటున్నది. టెండర్లు పిలిచి ఈ రోడ్డుకు తరుచూ మరమ్మతులు చేస్తున్నారు. రాజకీయ నాయకుల క్రషర్లు లక్డారంలో ఉండటంతో ఈ రోడ్డు టెండర్ల ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదికన నిర్వహిస్తారు.
ఈ టిప్పర్లు అధికారుల కంటపడకుండా గమ్యస్థానం చేరుకోవాలని డైవర్లపై ఒత్తిడి ఉంటుంది. డైవర్లు విపరీతమైన వేగంతో వెళ్తూ తరుచూ వాహనదారులను ఢీకొడుతున్నారు. పటాన్చెరు మండలంలో సగం రోడ్డు ప్రమాదాలకు కారణం టిప్పర్లే కావడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం అప్పటి పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, ఎంవీఐ ఆర్. విజయరావు రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు టిప్పర్ల డైవర్లు, యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికలోడు వాహనాల నియంత్రణపై, వాహన వేగ నియంత్రణపై అవగాహన కల్పించారు.
జరిమానాలు విధించాం..
పటాన్చెరులో అధికలోడు వాహనాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీల ద్వారా ఇప్పటికే వందకు పైగా కేసులు నమోదు చేసి ఫెనాల్టీలు విధించాం. నిబంధనల మేరకు బరువుతోనే టిప్పర్లు ప్రయాణించాలి. నిరంతరం వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నాం. టిప్పర్ల యజమానులను కూడా హెచ్చరించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు టిప్పర్ల డైవర్లకు అవగాహన కల్పించాం. అధికలోడు వాహనాలను నియంత్రిస్తాం.
– విజయరావు, ఎంవీఐ పటాన్చెరు