గజ్వేల్, జూన్ 16: సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్ట్టు ఉన్న గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.230కోట్లతో రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టారు. రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసినా కేసుల కారణంగా పూర్తి చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా అర్ధాంతరంగా నిలిచిన అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. సిటిజన్ క్లబ్ వద్ద రింగ్‌రోడ్డు పనులకు మోక్షం లభించడం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రయాణికులకు రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సిటిజన్ క్లబ్ వద్ద నిలిచిన 60మీటర్ల రింగ్ రోడ్డు పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 23 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు నిర్మాణంలో ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల మధ్య మిగిలిన 1.6 కిలోమీటర్ల రింగ్‌రోడ్డు పనులను రైల్వేశాఖ వారు ప్రస్తుతం చేపడుతున్నారు. గజ్వేల్-సంగాపూర్ మార్గంలో సిటిజన్ క్లబ్ వద్ద అసంపూర్తిగా మిగిలిన రింగ్‌రోడ్డు పనులను పూర్తిస్థాయిలో చేపట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదు. దీంతో నేటికి రోడ్డు అసంపూర్తిగానే కనిపిస్తుంది. ఇదే మార్గంలో ప్రస్తుతం ఆర్అండ్ఆర్ కాలనీ గ్రామాలు, వర్గల్, చౌదర్పల్లి, మాక్త్త, సింగాయిపల్లి, నెంటూర్, అంబర్‌పేటతో పాటు ములుగు మండల కేం ద్రానికి వెళ్లే ప్రయాణికులు అసంపూర్తిగా ఉన్న రోడ్డుతో తరచూ ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు వస్తే గుంతల్లో నీళ్లు చేరడంతో ద్విచక్రవాహనదారులు వాటిలో పడిపోయి ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఒక వరుస రోడ్డు పనులు పూర్తికాగా మరో వరుస మట్టిరోడ్డు కావడంతో వర్షాలతో పూర్తిగా గుంతలుగా మారింది. ఈ మట్టి రోడ్డుపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొందరు వాహనదారులు రాం గ్‌రూట్‌లో వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో ఇద్దరు మృతి చెందగా మరికొంత మందికి గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య తీరడంతో ప్రమాదాలు జరగకుండా ఉంటుంది.
గజ్వేల్-సంగాపూర్ మార్గంలో నిలిచిన రింగ్‌రోడ్డు పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరనుంది. ప్రస్తుతం చెన్నై, బెంగళూర్, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, చిట్యాల తదితర ప్రాంతాల నుంచి ముంబాయి, పూణే, నిజామాబాద్ ప్రాంతాలకు వెళ్లే కంటైనర్లు, లారీలు శ్రీగిరిపల్లి రింగ్ నుంచి రింగ్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. అందుకు ప్రభుత్వం వెంటనే గజ్వేల్-సంగాపూర్ మార్గంలో నిలిచిన పనులపై దృష్టి సారించి పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. రింగ్‌రోడ్డు పూర్తయితే పట్టణంలోకి భారీ కంటైనర్లు, లారీ లు రాకుండా రింగ్‌రోడ్డు మార్గంలో వెళ్తే పట్టణ వాసులకు ట్రాఫిక్ సమస్యతో ఉపశమనం లభించనున్నది.