జహీరాబాద్, మే 30: సంగారెడ్డి-నాందేడ్ 161 జాతీయ రహదారికి సంబంధించిన 45.96 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న బీదర్-నిజాంపేట్ 161బీ రహదారి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని నిజాంపేట్, నారాయణఖేడ్, మనూరు, న్యాల్కల్ మండలాల్లోని గ్రామాల మీదుగా బీదర్‌కు వెళ్లేందుకు కేంద్రం ఈ పనులు చేపడుతున్నది. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అప్పటి ఎంపీ బీబీ పాటిల్ సైతం రోడ్డు నిర్మాణానికి కృషిచేశారు. అప్పట్లో బీదర్-నిజాంపేట్ రోడ్డును 50 జాతీయ రహదారిగా నిర్మించడానికి డిక్లేర్ చేశారు.
కానీ, నిధులు మంజూరు చేయలేదు. దీంతో భూసేకరణ, పరిహారం తదితర అంశాల వల్ల ఆలస్యమైంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రహదారి నిర్మాణానికి నిధుల మంజూరు చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం స్పందించి, 2022లో బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 512.98 కోట్ల నిధులు మంజూరు చేసింది. సంగారెడ్డి- నాందేడ్ 161 జాతీయ రహదారిగా ఉండడంతో అనుసంధానంగా నిజాంపేట్-బీదర్ రోడ్డును 161బీ జాతీయ రహదారిగా గుర్తించారు.క
రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిజాంపేట్ నుంచి బీదర్‌కు 60 కిలోమీటర్ల దూరం ఉండడంతో సంబంధిత శాఖాధికారులు తగుచర్యలు తీసుకుని రహదారికి చాలాచోట్ల మూల మలుపులు తగ్గిస్తూ 45.96 కిలోమీటర్ల దూరం రెండు లైన్లుగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆయా నియోజక వర్గంలోని నిజాంపేట్, మూడుగంటలు, ర్యాలమడుగు, డీఎస్టీతండా, నారాయణఖేడ్, వెంకటపూర్, బాణాపూర్, జగన్నాథ్‌పూర్, పిప్రి, మనూర్, పూల్కుర్తి, రాఘవపూర్, చాల్కి, ఇబ్రహీంపూర్, న్యాల్కల్, ఆత్నూర్, డప్పూర్, మల్గి గ్రామాల పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
జహీరాబాద్-నారాయణఖేడ్ నియోజకవర్గాలకు కర్ణాటక సరిహద్దుగా ఉండడంతో 161బీ నిజాంపేట్-బీదర్ జాతీయ రహదారి పూర్తయితే ఆంతర్రాష్ట్రరవాణాకు మార్గం సుగమం కానున్నది. ప్రజలు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ జిల్లా కేంద్రానికిరాకపోకలు సాగించవచ్చు. జహీరాబాద్, నారాయణఖేడ్, బీదర్‌కు రాకపోకలు సాగించేందుకు గతుకుల రోడ్డుపై వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. కానీ, ఈ జాతీయ రహదారి నిర్మాణంతో అరగంటలోనే వాహనచోదకులు చేరుకునేందుకు వీలు కలుగుతుంది. జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే ఆయాప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.