హుస్నాబాద్, డిసెంబర్ 3: బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం… కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక పోవడం చర్చనీయాంశమైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో సిద్దిపేట జిల్లాను విస్మరించి కేవలం కరీంనగర్ జిల్లా గురించే సీఎం మాట్లాడడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి తుమ్మల నాగేశ్వర్రావు ప్రస్తావన తెచ్చారు తప్ప సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి పేరు తీయకపోవడం గమనార్హం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి మీటింగ్ అయితే కరీంనగర్లో పెట్టుకోవాలి గాని, హుస్నాబాద్‌లో ఎందుకు పెట్టారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లతో హుస్నాబాద్‌ను పోల్చి ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగలేదనడంపై కూడా వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా సిద్దిపేట జిల్లాకు వచ్చి కరీంనగర్‌ను పొగడటాన్ని సిద్దిపేట జిల్లా ప్రజలు ఒకింత చులకనకు గురయ్యారనేది వాస్తవం.
హుస్నాబాద్‌లో సీఎం సభ అట్టర్‌ప్లాప్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ఆశించిన జనం రాలేదు. సభకు వచ్చిన జనం కూడా ఉండలేక వెనుతిరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభా స్థలికి చేరుకునే సరికి ఖాళీకుర్చీలే మిగిలాయి. దీంతో ఆ ఖాళీ కుర్చీలకే సీఎం రేవంత్ స్పీచ్ ఇచ్చాడు. హుస్నాబాద్‌కు ఏదో చేస్తాడని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప హుస్నాబాద్‌కు ఇది చేస్తాను అని కచ్చితంగా ప్రకటించలేకపోయారు. గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో భాగంగా ఈ రెండు సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. రెండేళ్ల నుండి పట్టించుకోలేదు. ఇప్పుడేం చేస్తాడని సభకు వచ్చిన వారు చర్చించుకున్నారు.
ప్రజాపాలన విజయోత్సవ సభ విజయవంతం కోసం అధికార యంత్రాంగం, కాంగ్రెస్ నాయకులు ఐదారు రోజులుగా శ్రమించారు. కానీ, నియోజకవర్గ ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు బహిరంగ సభ అని చెప్పి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా సీఎం రాలేదు. దీంతో జనాలు సభపై విసుక్కున్నారు. చివరి అరగంటలో మంత్రులు మాట్లాడినప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు, విద్యార్థి విభాగం నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లలో సీఎం సభ అయిపోయేంత వరకు ఉంచారు. కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా హుస్నాబాద్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహించింది.
ఈ సభ పూర్తిగా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి జనాలను తీసుకువచ్చారు. వడ్డీ లేని రుణాలను ఇచ్చాము. మీరంతా సీఎం మీటింగ్‌కు తప్పకుండా రావాలని కాంగ్రెస్ నేతలు హుకుం జారీ చేశారు. మహిళా సంఘాల్లోని ఏ సభ్యురాలు రాకపోయినా ఫైన్ వేస్తామని గ్రామ సీఏల చేత చెప్పించారు. దయచేసి ఉండండి మరో అరగంటలో సీఎం గారు వస్తారు… ఎక్కడికి వెళ్లకండి బయట ఉన్నవాళ్లంతా లోపలికి రండి….. ఆలస్యానికి క్షమించండి అంటూ పదే పదే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను బతిమాలాడారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది. వస్తున్నాడు. ఆగండి అంటూ వేదిక ద్వారా ప్రజలను వేడుకున్నారు. పొన్నం మాటలతో కాంగ్రెస్ క్యాడర్ ఎక్కడికక్కడ మీటింగ్‌కు వచ్చిన జనాన్ని పోకుండా అక్కడే సముదాయించి కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. వీరి మాటలు ఏం పట్టించుకోకుండా ప్రజలు తమ తమ గ్రామాలకు వెళ్లిపోయారు.