పటాన్చెరు/పటాన్చెరు రూరల్, జూలై 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి న్యాయం చేయాలని కోరుతూ రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ దుర్ఘటనపై నమోదైన కేసు విచారణ భానూర్ పోలీస్స్టేషన్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేయాలని, నేరపూరిత నిర్లక్ష్యానికి కారణమైన సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని పిల్లో కోర్టును కోరారు. సీఎం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక వెంటనే విడుదల చేయాలని కోరారు.
ప్రమాద సమయంలో పరిశ్రమలో 143 మంది కార్మికులు ఉన్నారని సిగాచి పరిశ్రమ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేరొన్నదని, వాస్తవానికి 163 మంది కార్మికులు పరిశ్రమలో ఆ సమయంలో ఉన్నారని, సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు దీనికి ధృవీకరిస్తున్నాయని పిల్లో రిటైర్ట్ శాస్త్రవేత్త పేరొన్నారు. గల్లంతైన ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి వారి మృతదేహాలు లభ్యం కానప్పటికీ వారిని మరణించిన వారి కిందనే ప్రకటించి పరిహారం అందించాలని కోరారు.
వారికి రూ.15 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించినట్లు పరిశ్రమ తెలిపిందని, మరణించిన ఇతర కార్మికుల కుటుంబాలకు లక్ష, గాయపడిన వారికి 50 వేల రూపాయలు తాతాలిక పరిహారం ప్రకటించినప్పటికీ పూర్తి పరిహారం అందలేదని పిల్లో ఆయన పేరొన్నారు. చాలామంది మరణించిన కార్మికులు ఉత్తరాది నుంచి వలస వచ్చిన వారిని, వారికి సరైన సమాచారం, మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. పిల్ పూర్తిగా ప్రజాప్రయోజనాలకు సంబంధించినదని, గతంలో జరిగిన ఎబ్బీ ఆర్గానిక్స్ (సంగారెడ్డి), ఎస్ఎన్టీయా అడ్వా న్స్ సైన్సెస్ (అనకాపల్లి) వంటి ప్రమాదాల్లో పరిహారం చెల్లింపు తీరును పిల్లో ఉదహరించారు. అనకాపల్లి ఘటనలో పరిహారం చెకులను వెంటనే పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ సిగాచి కేసులో జాప్యాన్ని ప్రశ్నించారు.
ఈ దుర్ఘటనలో బాధితులకు పూర్తి సత్వర న్యాయం జరగాలని, భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రత ప్రమాణాలు అమలు చేయాలని ప్రజాప్రయోజన వాజ్యంలో రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. కోటి పరిహారం విషయంలో క్లారిటీ లేదని, విచారణ వేగవంతం చేసి నిందితులను అరెస్టు చేయాలని ఆయన పిల్లో పేర్కొన్నారు.