శివ్వంపేట, జూన్ 23 : మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ‘మన తెలంగాణ’ దినపత్రిక విలేకరి రాఘవేంద్రపై జరిగిన దాడిని శివ్వంపేట మండల విలేకరులు తీవ్రంగా ఖండిచారు. ఈ సందర్భంగా మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొడ్డు రవి మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చినందుకు పాత్రికేయుడిపై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పాత్రికేయులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కమలాద్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు బాసంపల్లి పోచాగౌడ్, పెద్దగౌని నటరాజ్ గౌడ్, ముండ్రాతి బాలేష్, బుర్ర మహేష్ గౌడ్, పోల్దాస్ వెంకటస్వామి, బాసంపల్లి కిషోర్ గౌడ్, కొత్త కుమ్మరి ప్రకాష్, పల్లె వీరేశం తదితరులు ఉన్నారు.