సంగారెడ్డి కలెక్టరేట్, మే 19: సంగారెడ్డి జాతీయ రహదారి పక్కనున్న ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి 44 అర్జీలు అందాయి. ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర అధికారులకు అర్జీని ఇచ్చారు.
ముంబై జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నెంబరు 374లోని 900 గజాల ప్రభుత్వ స్థలంలో కొంత మంది ప్రైవే టు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి ఇండ్లు లేకుండా ఇంటి నెంబరు పొంది అధికారులను తప్పుదోవ పట్టించి జీవో నెంబరు 59 ప్రకారం క్రమబద్ధ్దీకరణ చేసుకొని, నిబంధనలకు విరుద్ధ్దంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు.
2022లో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు 2024 జూన్‌తో ముగిసినప్పటికీ ప్రతి మూడు నెలలకు ఒకసారి గడువు పొడిగిస్తున్నందున జర్నలిస్టులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కొండాపూర్ మం డలం మారేపల్లికి చెందిన హనుమకొండ జంగయ్య అర్జీని అందజేశారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయాలని కోరారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వల్లూ రు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.