ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా జనం మెచ్చిన నాయకుడిగా నిలిచిపోతున్నారని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. జిల్లాలో మంత్రి జన్మదిన వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకులు, కేటీఆర్ అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తూ యువతకు ఉపాధి కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి కేటీఆర్ అని కొనియాడారు. చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కేక్ కట్ చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కేక్ కట్ చేసి పార్టీ నాయకులతో మొక్కలు నాటారు. కూరగాయల మార్కెట్లో మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు బొద్దుల కృష్ణ కేక్ కట్ చేశారు. పెద్దశంకరంపేటలో ఎంపీపీ, అల్లాదుర్గంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, శివ్వంపేటలోని ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ కేక్ కట్ చేశారు. రామాయంపేటలోని ఎస్సీ కాలనీలో మంత్రి పుట్టిన రోజు వేడుకలను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంత్రి పుట్టిన రోజు వేడుకలను చైర్మన్ రాఘవేందర్ గౌడ్, నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు రెయిన్కోట్లను పంపిణీ చేశారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీపీ నవనీత రవి మంత్రి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.