మర్కూక్/ జగదేవపూర్, నవంబర్ 6: సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లే కాలువ తూమ్ను జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. వరికోతలు చేతికి వస్తున్నందున ఆ జిల్లా రైతుల విజ్ఞప్తి మేరకు తూమ్ గేట్లను బంద్‌చేసే క్రమంలో తలెత్తిన సమస్యను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. తూమ్ వద్ద చెత్తాచెదారం, ముళ్లకంప, కట్టెలు అడ్డురావడంతో నీరు లీకేజీ జరిగింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎస్ఈ లక్ష్మణ్, ఈఈ శ్రీనివాస్, సాగునీటిశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ అక్కడే ఉండి పనులను పర్యవేక్షించి, తూమ్ మరమ్మతులు పూర్తిచేయించారు అనంతరం వర్గల్ ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో రికార్డులు, ల్యాబ్, అసంపూర్తిగా ఉన్న రూమ్‌లను పరిశీలించారు. త్వరగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గండితో వంద ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని జగదేవపూర్ కాలువలపై నీటిపారుదలశాఖ అధికారులు గండి కొట్టడంతో పరిసర ప్రాంతాల్లోని నీరు పొంగిపొర్లి పత్తి, వరి పంటలకు నష్టం జరిగింది. గురువారం జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప, ములుగు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు అనిల్‌కుమార్ దెబ్బతిన్న పంటలను స్థానిక అధికారులు, నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగదేవపూర్, ఇటిక్యాల రెవెన్యూ గ్రామాల్లో 60 ఎకరాల్లో వరి పంట, 40 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించిట్లు తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని చెప్పారకు. గండి కొట్టిన కాలువలను వేగంగా సంబంధిత శాఖల అధికారులతో కలసి కాలువలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈవోలు ఖలీల్, నాయకులు చంద్రం, రైతులు పాల్గొన్నారు.