హుస్నాబాద్ టౌన్, మే 2: తెలంగాణలో అతిపెద్ద ఎల్లమ్మ దేవాలయంగా గుర్తింపు పొందిన హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయ ఉత్సవాలు మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏటా ఈ ఆలయానికి పాలక మండలిని నియమిస్తున్నారు. గతేడాది నుంచి పాలక మండలిని నియమించకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలక మండలిని నియమించక పోవడంతో అధికారుల నిర్వహణలో ఆలయం కొనసాగుతున్నది. కాకతీయుల కాలంలో నిర్మించిన హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ఏటా మే నెలలో జరిగే జాతరకు వేలాది మంది భక్తులు హాజరవుతారు.
ఆలయ కమిటీ చైర్మ న్ పదవికి కాంగ్రెస్‌కు చెందిన పూదరి శ్రీనివాస్‌గౌడ్, పచ్చిమట్ల శ్రీకాంత్‌గౌడ్, పూదరి నర్సాగౌడ్, గట్టు రామకృష్ణ, మాజీ అధ్యక్షుడితో పాటు పలువురు పోటీపడుతున్నారు. మూడు నెలల క్రితం పాలకమండలి సభ్యులకు దేవాదాయ, ధర్మాదాయ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. స్థానిక నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీని నియమించే విషయంపై ఒక నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆలయ భూముల విషయంపై ఇటీవల చెలరేగిన వివాదంలో కాంగ్రెస్ నాయకులు సరైన విధంగా స్పందించలేదనే భావన మంత్రి పొన్నం ప్రభాకర్‌లో అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. ఆలయ భూములను తానే కబ్జా చేశాననే విధంగా ప్రచారం చేసినప్పటికీ, ప్రతిపక్షాల విమర్శలను సరైన రీతిలో తిప్పికొట్టక పోవడంతో ఆలయ కమిటీని నియమించే విషయాన్ని స్వయంగా మంత్రి బ్రేక్‌లు వేసినట్లు ప్రచారం సాగుతున్నది. జాతరకు వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి పాలకమండలిని నియమించే అవకాశాలు లేవు. ఈ తరుణంలో ఉత్సవ కమిటీనైనా నియమిస్తారని ఆశగా భక్తులు ఎదురుచూస్తున్నా వారికి నిరాశే తప్పదనట్లు తెలుస్త్తోంది.